Home

»

Latest News

చరిత్ర చదివాక రాహుల్‌కు అంత కోపం వచ్చిందా? ‘రణబాలి’ పుట్టుక వెనుక అసలు కథ ఇదే!

Oct 8, 2026 8:45PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. తాజాగా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమా పుట్టుక గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దాదాపు 150 ఏళ్ల క్రితం జరిగిన ‘ది గ్రేట్ సౌత్ ఇండియన్ మద్రాస్ ఫ్యామిన్’ గురించి తెలుసుకున్న తర్వాత తనలో తీవ్ర ఆవేశం వచ్చిందని, ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టిందని చెప్పారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో అన్నం దొరక్క కోటి మంది ప్రజలు చనిపోయిన ఇంతటి విషాదం గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చెప్పలేదనే ప్రశ్న తనను వెంటాడిందని తెలిపారు.

‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తున్న సమయంలో రాయలసీమకు చెందిన ఓ పురాతన బుర్రకథ తన దృష్టికి వచ్చిందని రాహుల్ చెప్పారు. తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న ఆ కథలో దేవుళ్లతో మాట్లాడే, రాక్షసులను ఎదుర్కొనే ఓ సీమ యోధుడి గాథ తనను బాగా ప్రభావితం చేసిందన్నారు. ఆ కథ ఆధారంగా రాయలసీమ చరిత్రను లోతుగా పరిశీలించినప్పుడు అప్పటి కరువు పరిస్థితులు, బ్రిటీష్ పాలనలో జరిగిన దారుణాలు తనకు తెలిసాయని చెప్పారు. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోనూ ఎంతోమంది ప్రజలు ఆకలితో చనిపోయినట్లు చరిత్ర ద్వారా తెలుసుకున్నానని రాహుల్ వెల్లడించారు.

ఇంతటి భారీ చారిత్రక కథకు సాధారణ హీరో సరిపోడని రాహుల్ అభిప్రాయపడ్డారు. చిన్నప్పుడు చందమామ కథల పుస్తకాల కవర్‌పై కనిపించే యోధుడిలా.. చేతిలో కత్తి, గుర్రపు స్వారీ, కళ్లల్లో రౌద్రం కనిపించే భారీ కటౌట్ కావాలని, అలాంటి పాత్ర కోసం తన శరీరాన్ని మార్చుకోవడానికి కూడా సిద్ధపడే సత్తా విజయ్ దేవరకొండకు మాత్రమే ఉందని చెప్పారు. తన ఆలోచన చెప్పగానే చరిత్రపై ఆసక్తి ఉన్న విజయ్ వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఈ సినిమా కోసం రెండేళ్లు రీసెర్చ్, మరో రెండేళ్లు షూటింగ్.. మొత్తంగా నాలుగేళ్ల పాటు టీమ్ కష్టపడి పనిచేసిందని రాహుల్ వెల్లడించారు.

ఇక ‘రణబాలి’ అనే టైటిల్‌కు కూడా ఓ ప్రత్యేకమైన అర్థం ఉందని రాహుల్ చెప్పారు. తారకాసురుడిని సంహరించడానికి దేవసేనాని కుమారస్వామి యుద్ధానికి వెళ్లే ముందు ఎత్తిన ఉగ్ర రూపాన్ని ‘రణబాలి’గా పేర్కొన్నారని తెలిపారు. అదే విధంగా సినిమాలో హీరో పాత్ర కూడా తెల్లదొరలపై విరుచుకుపడే ఉగ్ర రూపంలో ఉంటుందని చెప్పారు. నేటి తరానికి కొన్ని నిమిషాల్లోనే ఆహారం అందుతున్నా.. తిండి గింజలు లేక తమ పూర్వీకులు ఎలా చనిపోయారు, ఆ దారుణాలను వారు ఎలా ఎదుర్కొన్నారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశామని రాహుల్ తెలిపారు. ‘రణబాలి’ అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

[Ranabaali, Ranabaali Movie, Vijay Deverakonda Ranabaali, Rahul Sankrityan, Rahul Sankrityan Ranabaali, Ranabaali Trailer Launch, Ranabaali Trailer Event, Vijay Deverakonda, Ranabaali Story, Ranabaali Inspiration, Great South Indian Madras Famine, Madras Famine, Vijay Deverakonda New Movie, Rashmika Mandanna, Ranabaali Latest Update, Ranabaali Director Rahul Sankrityan, Vijay Rahul Sankrityan, Ranabaali Release Date, Mythri Movie Makers, Telugu Cinema, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com