విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ మూవీ ‘రణబాలి’. 19వ శతాబ్దం నాటి బ్రిటీష్ ఇండియా నేపథ్యంలో 1854-1878 మధ్య జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా భారత స్వాతంత్య్ర పోరాటం గురించి మాత్రం కాదని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక ఊరి కథ అని, తమ ఊరు, పొలిమేరలు, అక్కడి మనుషులను కాపాడుకునే వీరుల కథ అని చెప్పారు.
రణబాలితో సహా సినిమాలోని పాత్రలకు దేశం ఎంత పెద్దది అనే విషయం కూడా తెలియదని రాహుల్ తెలిపారు. వారికి తమ ఊరు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మాత్రమే తెలుసని, మద్రాస్ ఎక్కడ ఉందో కూడా తెలియదని చెప్పారు. తమ ఊరినే ఒక దేశంగా భావించే పరిస్థితిలో ఆ పాత్రలు ఉంటాయని, జాతీయ భావన కంటే తమ ఊరిని, తమ మనుషులను కాపాడుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారని వివరించారు. అయితే ఈ కథలో చూపించే సమస్య మాత్రం దేశంలోని ప్రతి ఊరికి కనెక్ట్ అవుతుందని, అప్పట్లో కరువు పరిస్థితులను ఎన్నో ప్రాంతాలు ఎదుర్కొన్నాయని చెప్పారు.
ఇక సినిమాలో బ్రిటీష్ పాత్రలను కూడా ప్రత్యేకంగా చూపించామని రాహుల్ తెలిపారు. బ్రిటీషర్లు అంటే యూనిఫామ్ వేసుకుని గన్స్ పట్టుకున్నట్టుగా కాకుండా, మన తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలను చూసినప్పుడు కలిగే ఫీలింగ్ వచ్చేలా ఆ పాత్రలను డిజైన్ చేశామని చెప్పారు. సినిమాలో బ్రిటీష్ పాత్రలు ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాయని, అవసరమైన సందర్భాల్లో మాత్రం తెలుగులో కూడా డైలాగ్స్ ఉంటాయని తెలిపారు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న దసరా సందర్భంగా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం, అలాగే పెళ్లి తర్వాత విజయ్-రష్మిక తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
[Ranabaali, Ranabaali Movie, Vijay Deverakonda Ranabaali, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Ranabaali Story, Ranabaali Movie Story, Ranabaali Independence Struggle, Ranabaali Freedom Struggle, Vijay Deverakonda New Movie, Vijay Rashmika Movie, Ranabaali Release Date, Mythri Movie Makers, Telugu Cinema, Tollywood, Ranabaali Latest Update]






