'హిరణ్య కశ్యప' రానా కాదు!
on Mar 31, 2023
డైరెక్టర్ గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'హిరణ్య కశ్యప'. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే మూడేళ్లు కాలం వెచ్చించారాయన. 'రుద్రమదేవి' చిత్రం తర్వాత పౌరాణిక చిత్రం 'హిరణ్య కశ్యప'ను తెరకెక్కించాలని భావించిన గుణశేఖర్.. ప్రి ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్‌పై సుదీర్ఘ కాలం పనిచేశారు. టైటిల్ రోల్‌కు రానాను ఎంచుకున్నారు. రానా సైతం ఆ పాత్ర చేయడానికి మానసికంగా సిద్ధమయ్యాడు కూడా. ముంబైకు చెందిన ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చింది.
అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఒక వైపు కరోనా, మరోవైపు రానా అనారోగ్యానికి గురికావడంతో.. సమయాన్ని వృథా చేసుకోకుండా మరోవైపు ప్రాజెక్ట్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు గుణశేఖర్. అలా 'శాకుంతలం' ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. శకుంతలగా సమంత నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమయ్యింది.
దాని తర్వాత 'హిరణ్య కశ్యప'ను తియ్యాలని గుణశేఖర్ అనుకుంటున్నారు. అయితే టైటిల్ రోల్‌ను రానా చెయ్యడం లేదని తెలుస్తోంది. మారిన పరిస్థితుల దృష్ట్యా క్యాస్టింగ్ గురించి పునరాలోచిస్తున్నట్లు తెలుగువన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. రానా చేస్తున్నరా, లేదా అనడిగితే ఆయన ఈమేరకు జవాబిచ్చారు. ఇదివరకు ఈ సినిమాని నిర్మించడానికి అంగీకరించిన సంస్థ ఇప్పుడు తప్పుకుందనీ, అందువల్ల దాన్ని తామే నిర్మించాలని అనుకుంటున్నామనీ ఆయన చెప్పారు. సో.. హిరణ్య కశ్యప రోల్‌లోకి మరో స్టార్ యాక్టర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే ఆ నటుడెవరనే విషయం వెల్లడి కానున్నది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
