మరోసారి విలన్ గా భల్లాలదేవుడు..!
on Mar 15, 2016
మొదటి సినిమాగా లీడర్ ను చేసినప్పుడే రానా చాలా వైవిధ్యమైన కెరీర్ గ్రాఫ్ ను ఫాలో అవబోతున్నాడని సినీ పండితులు గెస్ చేశారు. దాన్ని నిజం చేస్తూ, క్యారెక్టర్ మంచిదైతే, హీరోనా విలనా అని చూడకుండా వరస పాత్రలతో దూసుకుపోతున్నాడు దగ్గుబాటి వారబ్బాయి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకలెక్కన సినిమాలు చేస్తూ, సినిమా తర్వాత సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా, తమిళంలో గౌతమ్ మీనన్ డైరెక్షన్లో రాబోతున్న ఒక సినిమాలో కీలక పాత్రకు రానాను తీసుకుంటున్నారట.
ధనుష్ హీరోగా చేయబోయే ఈ సినిమాలో, రానాది విలన్ పాత్రే అయ్యుంటుందనేది ఫిల్మ్ నగర్ జనాల మాట. ఒక వేళ అది నిజమైతే మాత్రం, భల్లాలదేవుడి పాత్రకు ఎంత పేరొచ్చిందో దీనికి అంతే పేరు వస్తుందనడంలో డౌట్ లేదు. ఎందుకంటే, గౌతమ్ మీనన్ సినిమాల్లో, హీరోకంటే విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. యాక్టింగ్ పరంగా నటీనటుల నుంచి బాగా నటనను రాబట్టుకుంటాడనే పేరు కూడా గౌతం కు ఉంది. దీంతో రానా పాత్ర ఏ రేంజ్ లో డిజైన్ చేసి ఉంటాడోనన్న దానిపై అంచనాలు పెరుగుతున్నాయి.ఎన్నై నొక్కి పాయుమ్ తొట్ట పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో కూడా రిలీజవుతుందని సమాచారం. మేఘా ఆకాశ్ అనే కొత్త భామ ఈ సినిమాతో తెరకు పరిచయం కాబోతోంది.