'రామానాయుడు సినీ విలేజ్' ఇక కనిపించదా?
on Feb 18, 2020
ఫిలింనగర్లో ఉన్న రామానాయుడు స్టూడియోస్ ఎంత ఫేమస్సో, హైదరాబాద్ శివార్లలోని నానక్రామ గూడలో ఉన్న 'రామానాయుడు సినీ విలేజ్' కూడా అంత ఫేమస్సే. అక్కడ ఉన్న సెట్లలో నిత్యం సినిమాల షూటింగ్స్ నడుస్తూనే ఉంటాయి. అది రామానాయుడు స్టూడియోస్‌కు ఎక్స్టెన్షన్ లాంటిది. అయితే అక్కడి వాతావరణాన్ని బట్టి దాన్ని స్టూడియో అనకుండా సినీ విలేజ్గానే అందరూ పరిగణిస్తూ వస్తుంటారు. అలాంటి సినీ విలేజ్ గతంలో కలిసిపోనున్నదా?.. అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఏడాదికి రెండు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్న ఆ సినీ విలేజ్‌ను అమ్మేయాలని నిర్మాత డి. సురేశ్ బాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దానికి బదులుగా వైజాగ్‌లో ఉన్న రామానాయుడు స్టూడియోస్‌ను మరింత డెవలప్ చెయ్యాలని ఆయన భావిస్తున్నారు.
వైజాగ్‌లోని సముద్ర తీరానికి సమీపంలో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కొన్నేళ్ల క్రితం రామానాయుడు నిర్మించిన స్టూడియోలో ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వైజాగ్‌ను రాజధానిగా నిర్ణయించడంతో స్టూడియోలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే మరింత ప్రయోజనం కలుగుతుందని సురేశ్ బాబు భావిస్తున్నారు. అందుకే నానక్రామ గూడలోని సినీ విలేజ్‌ను హౌసింగ్ కాలనీగా మార్చాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆ ప్రాంతం విసిరేసినట్లు సిటీకి దూరంగా ఉండేది. కానీ ఇవాళ ఆ ప్రాంతం కూడా సిటీలో కలిసిపోయి, ఆ ప్రాంతమంతా ఆకాశ హర్మ్యాలు వెలసి బాగా డెవలప్ అవడంతో, అక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీన్ని క్యాష్ చేసుకోవాలనేది సురేశ్ బాబు అభిప్రాయంగా కనిపిస్తోంది.
Also Read