Home

»

Latest News

సినిమా ప్రాజెక్టుల పేరుతో విదేశాలకు నిధులు.. రకుల్ ప్రీత్ వ్యవహారంలో ఐటీ దర్యాప్తు

Sep 28, 2026 7:32PM

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. సోమవారం ముంబైలో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఆమె మామ, ప్రముఖ నిర్మాత వాషు భగ్నానీ, పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన మొత్తం 12 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. సినిమా నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.

సినిమా షూటింగులు, విదేశీ పంపిణీ, నిర్మాణ ఖర్చుల పేరుతో పెద్ద మొత్తంలో నిధులను విదేశాలకు తరలించినట్లు అధికారులకు సమాచారం అందినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ లావాదేవీల్లో పన్ను నిబంధనలకు సంబంధించి ఏమైనా ఉల్లంఘనలు జరిగాయా? ఆదాయాన్ని దాచే ప్రయత్నం జరిగిందా? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఐటీ శాఖకు చెందిన బృందాలు పత్రాలు, ఆర్థిక రికార్డులు, ఇతర లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నాయి. అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సోదాల్లో ఏం బయటపడిందనే దానిపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. ఆమె 2024లో నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకున్నారు. జాకీ భగ్నానీ తండ్రే వాషు భగ్నానీ. వాషు భగ్నానీ బాలీవుడ్‌లో పలు చిత్రాలను నిర్మించారు. మరోవైపు కుమార్ మంగత్ పాఠక్ ఆధ్వర్యంలోని పనోరమా స్టూడియోస్ కూడా ఈ ఐటీ సోదాలకు సంబంధించిన సంస్థల్లో ఒకటిగా నివేదికలు పేర్కొంటున్నాయి. ‘రైడ్’, ‘దృశ్యం’ వంటి చిత్రాలతో ఈ నిర్మాణ సంస్థకు గుర్తింపు ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న ఈ సోదాలపై రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ లేదా సంబంధిత సంస్థల నుంచి అధికారిక స్పందన వచ్చినట్లు తాజా నివేదికల్లో పేర్కొనలేదు. ఐటీ శాఖ దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాలో శూర్పణఖ పాత్రలో కనిపించనున్నారు.

 

 

[Rakul Preet Singh IT Raid, Rakul Preet Income Tax Raid, Vashu Bhagnani IT Raid, Panorama Studios IT Raid, Rakul Preet Singh Latest News, Rakul Preet Singh Income Tax, Vashu Bhagnani Latest News, Mumbai IT Raids, Bollywood IT Raid, Rakul Preet Ramayana]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com