Home

»

Latest News

 'వెల్‌కమ్ త్రిచి ఈస్ట్ ఎమ్మెల్యే' అని పిలుస్తుంటే హ్యాపీగానే ఉంది. కానీ..?

Jun 30, 2026 6:32PM

తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా మరియు మానవతావాదిగా తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. సుమారు 20 ఏళ్లకు పైగా తన సొంత ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు, అనాథ పిల్లలకు వైద్య సేవలు అందిస్తూ నిజ జీవితంలోనూ ఎంతోమందికి ఆయన హీరోగా నిలిచారు. అయితే, గత కొన్ని రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో రాఘవ లారెన్స్ ఎంట్రీ గురించిన వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ మరియు త్రిచి ఈస్ట్ (తిరుచిరాపల్లి ఈస్ట్) స్థానాల నుండి ఘన విజయం సాధించి, ఆపై త్రిచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేయబోతున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. త్రిచి ఈస్ట్ ఉపఎన్నికల బరిలో లారెన్స్ ఖాయమంటూ సోషల్ మీడియాలో వస్తున్న వరుస కథనాలకు చెక్ పెడుతూ, ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన ఒక 16 నిమిషాల సుదీర్ఘ వీడియో ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది.

ఈ తాజా వీడియోలో రాఘవ లారెన్స్ త్రిచి ఈస్ట్ ఉపఎన్నికల పోటీపై వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. తాను త్రిచి ఈస్ట్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ఎంతో స్పష్టంగా ప్రకటించారు. తాను షూటింగ్స్ కోసం ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎంతో ప్రేమతో 'వెల్‌కమ్ త్రిచి ఈస్ట్ ఎమ్మెల్యే' అంటూ పిలుస్తుంటే ఎంతో సంతోషంగా అనిపించిందని, కానీ ఇక్కడ రాజకీయ ధర్మం అనే ఒక పాయింట్ ఉందని ఆయన గుర్తుచేశారు. దళపతి విజయ్ సినిమా హీరోగా ఉన్నప్పటి నుండి ఆయన కోసం పోస్టర్లు వేస్తూ, జెండాలు మోస్తూ, ఎంతో శ్రమించి గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని నిర్మించిన ఎంతోమంది సీనియర్ కార్యకర్తలు, నాయకులు ప్రస్తుతం టీవీకే పార్టీలో ఉన్నారని లారెన్స్ పేర్కొన్నారు. వారంతా ఎన్నో ఏళ్లుగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తుంటారని, అలాంటి చోట తాను నేరుగా వచ్చి నిలబడటం రాజకీయ ధర్మం అనిపించుకోదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకరు విత్తనం నాటి, అది మొలకెత్తి, చెట్టై కాసే వరకు కాపాడితే.. ఎవరో ఒకరు వచ్చి ఆ పండును కోసుకుని తినడం ఎంతవరకు న్యాయం? అంటూ ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణను చెప్పారు.

రాజకీయాల్లోకి రావాలనుకుంటే మొదట పార్టీలో ఒక సాధారణ సభ్యుడిగా చేరి, కనీసం 3 నుండి 4 ఏళ్ల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల కోసం కష్టపడాలని, ఆ తర్వాతే నాయకత్వం ఇచ్చే బాధ్యతలను స్వీకరించాలనేది తన పాలసీ అని లారెన్స్ స్పష్టం చేశారు. ఒకవేళ త్రిచి ఈస్ట్‌లో విజయ్ ఎవరిని నిలబెట్టినా ఆయన ముఖం చూసి ప్రజలు ఓట్లు వేస్తారని, అక్కడ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తన రాజకీయ ఆకాంక్షలపై మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న మాట నిజమేనని, అయితే ఏ పార్టీలో చేరాలనేది ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే ఆ వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. లారెన్స్ చేసిన ఈ వ్యాఖ్యలతో త్రిచి ఈస్ట్ నియోజకవర్గంపై నెలకొన్న సస్పెన్స్‌కు ప్రస్తుతానికి తెరపడినట్లయింది. అయితే భవిష్యత్తులో ఆయన ఏ పార్టీ జెండా పట్టుకోబోతున్నారు, ఎలాంటి రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగబోతున్నారు అనే ఉత్కంఠ మాత్రం అభిమానులలో మరింతగా పెరిగిపోయింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com