
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi). ఈ సినిమా గురించి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా 'తెలుగువన్'(TeluguOne)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకుంటూ రామ్ చరణ్ పాత్రపై చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.
చరణ్ మాస్ మేకోవర్.. ఆశ్చర్యపోవడం ఖాయం!
ఈ సినిమా కోసం రామ్ చరణ్ చేసిన మేకోవర్ గురించి అవినాష్ కొల్లా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "చరణ్ గారిని ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రల్లో చూశారు. కానీ 'పెద్ది'లో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా, ఎంతో రా (Raw) గా ఉంటుంది. ఆయన డెడికేషన్ చూసి ఆశ్చర్యం వేసింది" అని అవినాష్ పేర్కొన్నారు.
ఇది ఎవరి బయోపిక్ కాదు, కానీ ఒక లోకల్ స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ లా ఉంటుందని తెలిపారు. మే 18న వస్తున్న ట్రైలర్ చూసిన తర్వాత.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలిసి మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్నారు.
కథ విన్న తర్వాత 20 నిమిషాలు షాక్‌లోనే..
"దర్శకుడు బుచ్చిబాబు నాకు 'పెద్ది' కథ చెప్పినప్పుడు సుమారు 20 నిమిషాల పాటు నేను మామూలు స్థితికి రాలేకపోయాను. అంతటి బలమైన ఎమోషన్ ఈ కథలో ఉంది. కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, మనుషుల మధ్య ఉండే గాఢమైన బంధాలను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడి కళ్లు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి" అని అవినాష్ అన్నారు.
24 భారీ సెట్లు.. విజువల్ వండర్!
ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని వివరిస్తూ, సుమారు ఒక సంవత్సరం పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరిగాయని అవినాష్ తెలిపారు. "సినిమాలో సుమారు 24 భారీ సెట్లు వేశాం. కానీ అవి సెట్లు అని ఎవరూ గుర్తుపట్టలేరు. అంత సహజంగా విజయనగరం నేపథ్యాన్ని రీ-క్రియేట్ చేశాం." అని చెప్పారు.
1970-80 కాలం నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో భారీ సెట్లను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కథలో ఉండే ఎమోషన్ కు తగ్గట్టుగా విజువల్స్ చాలా నేచురల్ గా ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా, ఒక గ్రామీణ నేపథ్యాన్ని కళ్లకు కట్టేలా చూపించడానికి ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడింది ఆయన చెప్పారు.
దర్శకుడు బుచ్చిబాబు విజన్ అద్భుతమని అవినాష్ అన్నారు. బుచ్చిబాబు ఈ కథను ఎంత గొప్పగా విజువలైజ్ చేశారో అవినాష్ వివరించారు. జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఉండటంతో సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, విజువల్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఒక పక్కా లోకల్ మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా మాటలు విన్నాక, ఈ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద పెద్ద విధ్వంసమే సృష్టించేలా కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్, ఈ మట్టి కథతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు, సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.





