
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ '418' మూవీ రిలీజ్ సడన్‌గా వాయిదా పడింది. ప్రశాంత్ నీల్ శిష్యుడు కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ హారర్ లవర్స్ ని ఆకట్టుకుంది. "ఇన్నాళ్లూ హారర్ సినిమాల్లో కామెడీ చూసి నవ్వుకున్నది చాలు.. ఇక నుంచి నిజమైన భయం అంటే ఏంటో చూస్తారు" అని మేకర్స్ సవాల్ విసరడమే కాకుండా, సెన్సార్ బోర్డ్ నుండి 'A' సర్టిఫికేట్ సాధించి అందరిలో తీవ్ర ఉత్కంఠను పెంచేశారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు, కొందరు ప్రత్యేక ప్రేక్షకులకు ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ షోలు వేశారు. అలాగే నార్త్ ఇండియాకు చెందిన ప్రముఖ హిందీ ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మైండ్ బ్లాక్ అయ్యే రెస్పాన్స్ ఇచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్ ఎగ్జిబిటర్స్ అయితే.. "ఈ రేంజ్ హారర్ కంటెంట్‌ను కేవలం సౌత్ లాంగ్వేజెస్‌కే పరిమితం చేస్తే ఎలా? హిందీలో కూడా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాల్సిందే" అని మేకర్స్‌కు సూచించారట.

హిందీ బెల్ట్‌లో సరైన ప్రాపర్ హారర్ సినిమాలకు ఉన్న డిమాండ్ తెలిసిందే. ఉత్తరాది ఎగ్జిబిటర్ల నుండి వచ్చిన ఈ అనూహ్య స్పందనతో మైత్రీ మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ ఆలోచనలో పడ్డారు. ఒక గొప్ప కంటెంట్‌ను తక్కువ స్కేల్‌లో రిలీజ్ చేయడం కంటే, కొద్ది రోజులు టైమ్ తీసుకుని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి భారీగా విడుదల చేస్తే రేంజ్ వేరేలా ఉంటుందని భావించారు.
అందుకే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. "మీ నిరీక్షణ కాస్త పెరిగినా, '418' అనుభవం మాత్రం అంతకు మించిన గ్రాండ్ రేంజ్‌లో ఉండబోతోంది" అని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల మార్కెట్లలో విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహించి, సరికొత్త విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
[418 Movie Postponed, 418 Pan India Release, 418 Release Date, Prashanth Neel, Mythri Movie Makers, Kirtan Nadagouda, Telugu Film News, Telugu News]





