
టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘బలగం’ సంజయ్ కృష్ణ. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’(Peddi)లో నటిస్తున్న ఆయన, తదుపరి లైనప్‌తో టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పిరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’(Fauzi)లో కూడా సంజయ్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. తాజాగా తెలుగువన్(TeluguOne)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ, ‘ఫౌజీ’ విశేషాలతో పాటు ప్రభాస్ లుక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Actor Balagam Sanjay Interview)
ఒకప్పుడు ఆడిషన్స్ కోసం ఇండస్ట్రీలో ఎంతో తిరిగిన సంజయ్ కృష్ణ.. ఇప్పుడు ‘బలగం’ తెచ్చిన గుర్తింపుతో ఆడిషన్స్ అవసరం లేకుండానే వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం చిన్న చిత్రాల దర్శకులు సైతం తన ఫేస్ వాల్యూ నమ్మి పోస్టర్లు, ట్రైలర్లలో ప్రాధాన్యత ఇస్తుండటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తను చేసే ప్రతి పాత్ర కథతో ముడిపడి ఉండేలా, ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నట్లు తెలిపారు.
రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో ఒక మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్‌లో నటించినట్లు సంజయ్ వెల్లడించారు. ఈ చిత్రం కోసం దాదాపు 4 నుండి 5 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నానని చెప్పారు. అయితే ఆ తర్వాత ‘ఛాంపియన్’ వైజాగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్స్, ‘ఫౌజీ’ తదుపరి షెడ్యూల్ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాలేదని.. అయినప్పటికీ తాను చేసినంత వరకు సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయని పేర్కొన్నారు.
డైరెక్టర్ హను రాఘవపూడి మేకింగ్ స్టైల్, విజన్‌పై సంజయ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన సాధారణ వ్యక్తి కాదని, సబ్జెక్ట్ మీద విపరీతమైన కమాండ్ ఉన్న దర్శకుడని కొనియాడారు. కచ్చితంగా ‘ఫౌజీ’ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో ఒక మైండ్‌బ్లోయింగ్ హిట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ అదిరిపోయే లుక్‌లో కనిపించబోతున్నారని, ఆయన లుక్ చూస్తే ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేనంత షాక్‌కు గురవుతారని, అంత హ్యాండ్సమ్‌గా ప్రభాస్ కనిపించబోతున్నారని ఒక క్రేజీ లీక్ ఇచ్చారు.
ఇక మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. చిరంజీవి గారు, వరుణ్ తేజ్, రామ్‌చరణ్, ఇప్పుడు సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ఇలా కంటిన్యూస్‌గా మెగా హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం తన అదృష్టమని భావిస్తున్నట్లు చెప్పారు. ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ సంజయ్ దత్‌తో కలిసి ఒక హెవీ ఎమోషనల్ సీన్ చేశానని.. ఆ సీన్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్‌లోకి లీనమై రియల్‌గా ఏడ్చేశానని గుర్తుచేసుకున్నారు. తన పర్ఫార్మెన్స్ చూసి సంజయ్ దత్ వెన్నుతట్టి "బాలా బాగుంది.. జబర్దస్త్ యాక్టింగ్" అంటూ హిందీలో ప్రశంసించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఎమోషనల్ అయ్యారు.
తిరువీర్ ‘భగవంతుడు’ చిత్రంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న సంజయ్.. ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా తన పేరు ముందున్న ‘బలగం’ అనే ట్యాగ్‌ను ఎప్పటికీ వదులుకోనని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్ల కష్టానికి గుర్తింపునిచ్చి, తనకు అన్నం పెట్టిన బేసిక్స్‌ను ఎప్పటికీ మర్చిపోనని సంజయ్ చెప్పారు.





