పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, క్లాసిక్ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి మైత్రీ మూవీ మేకర్స్ ఆవిష్కరించిన సరికొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత ఇంటెన్స్‌గా ఉన్న ఈ విజువల్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ తాజా పోస్టర్‌లో ప్రభాస్ ఫేస్ రివీల్ చేయకుండానే మేకర్స్ ఓ విధ్వంసాన్ని ఆవిష్కరించారు. రక్తసిక్తమైన వైట్ బనియన్, ధోతీ కట్టులో ఉన్న ప్రభాస్ రెండు చేతుల్లో పిస్టల్స్ పట్టుకుని ముందుకు సాగుతుంటే.. చారిత్రక చార్మినార్ పరిసరాలు కాలిపోతూ మారణహోమం కనిపిస్తోంది. మరోవైపు గాంధీజీ వేషధారణలో ఉన్న ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకుని అహింసా మార్గంలో వెనక్కి నడుస్తున్నట్లు చూపించిన విజువల్ కాన్సెప్ట్ సినిమాపై ఊహించని రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేసింది.
ఒకవైపు దేశపిత చూపించిన అహింస, మరోవైపు నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రేరణతో ప్రభాస్ ఎంచుకున్న సాయుధ విప్లవం.. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని దర్శకుడు హను రాఘవపూడి అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. "ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్" (A Battalion Who Fights Alone) అనే క్యాప్షన్‌తో పాటు "1932 నుంచి మోస్ట్ వాంటెడ్" అని రాసి ఉన్న ఈ పోస్టర్, బ్రిటిష్ కాలం నాటి ఉద్వేగభరితమైన పోరాటాన్ని కళ్లకు కడుతోంది.
'సీతా రామం' వంటి క్లాసిక్ హిట్ తర్వాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియడ్ చిత్రంలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈమాన్ ఇస్మాయేల్ కథానాయికగా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు.
పోస్టర్ రిలీజ్ కాగానే ప్రభాస్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌ను 'బాహుబలి' పిక్ నుంచి దాదాపు ఏడేళ్ల తర్వాత 'ఫౌజీ' పోస్టర్‌గా మార్చడంతో డార్లింగ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ భారీ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తోంది. మరి డిసెంబర్ సెంటిమెంట్‌ను నమ్ముకుని వస్తున్న ప్రభాస్ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి చారిత్రక రికార్డులను సృష్టిస్తారో వేచి చూడాల్సిందే!




