రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన క్లాసిక్ చిత్రం ‘భక్త కన్నప్ప’కు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ)లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. తన పెదనాన్న నటించిన సినిమా ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రదర్శితం కావడంపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
‘భక్త కన్నప్ప’ సినిమా తన చిన్ననాటి జ్ఞాపకాల్లో ప్రత్యేకమైనదని ప్రభాస్ పేర్కొన్నారు. పెదనాన్న కృష్ణంరాజు నటించిన ఈ చిత్రాన్ని తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు నిర్మించారని, బాపు గారు అద్భుతంగా తెరకెక్కించారని గుర్తు చేసుకున్నారు. ఎన్నేళ్లు గడిచినా కొన్ని కథలు ఎప్పటికీ నిలిచిపోతాయని, ఈ సినిమాకు ఇఫీలో గౌరవం దక్కడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఇది తమ కుటుంబానికి అందమైన వారసత్వం, నిజమైన గౌరవం అని భావోద్వేగంగా రాసుకొచ్చారు.
1976 మే 26న విడుదలైన ‘భక్త కన్నప్ప’ ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇఫీ 2026లో భారతీయ సినిమాల స్వర్ణోత్సవ విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణంరాజు భక్త కన్నప్ప పాత్రలో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కన్నప్ప భక్తి, శివుడిపై ఆయనకున్న అపారమైన విశ్వాసం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్, జయప్రద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రకటించారు. మరోవైపు పెదనాన్న కృష్ణంరాజు నటించిన క్లాసిక్ సినిమాకు ఇఫీలో గౌరవం దక్కడం ప్రభాస్ అభిమానులకు కూడా ఆనందాన్ని కలిగిస్తోంది.
[Prabhas, BhaktaKannappa, IFFI2026, KrishnamRaju BhaktaKannappa50Years, IFFIGoldenJubileeFilms]





