Home

»

Latest News

షాకింగ్ న్యూస్.. షూటింగ్ లో ప్రమాదం.. ప్రముఖ హీరో మృతి!

Mar 30, 2026

  • బెంగాలీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం 
  • షూటింగ్ విరామంలో ఊహించని ప్రమాదం
  • ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి ప్రముఖ నటుడు మృతి

బెంగాలీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సినీ, టీవీ రంగాలలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (43) ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి మరణించారు. షూటింగ్ కోసం ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని తల్సారి బీచ్‌కు వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆయన అకాల మరణంతో బెంగాలీ సినీ, టీవీ రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. (Rahul Arunoday Banerjee)

అసలేం జరిగింది?
రాహుల్ ప్రస్తుతం 'భోలే బాబా పార్ కరేగా' అనే బెంగాలీ సీరియల్‌లో నటిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే యూనిట్ సభ్యులతో కలిసి తల్సారి బీచ్ సమీపంలో షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత, ఆయన ఒంటరిగా సముద్ర తీరానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తు నీటిలోకి వెళ్లిన రాహుల్, అలల తాకిడికి బయటకు రాలేకపోయారు. తోటి నటీనటులు, టెక్నీషియన్లు గమనించి వెంటనే స్పందించి ఆయన్ను నీటి నుంచి బయటకు తీశారు.

ఆసుపత్రికి తరలించే లోపే..
నీటిలో మునిగిపోయిన రాహుల్‌ను అపస్మారక స్థితిలో గమనించిన యూనిట్ సభ్యులు వెంటనే దిఘా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో ఈ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్క్రిప్ట్ ప్రకారం ఆ సమయంలో నీటిలోకి వెళ్లాల్సిన అవసరం లేదని, ఆయన స్వచ్ఛందంగానే నీటి వైపు వెళ్లారని షూటింగ్ యూనిట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కెరీర్ నేపథ్యం..
2008లో వచ్చిన 'చిరోదిని తుమి జే అమర్' సినిమాతో రాహుల్ రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. ఆ చిత్రంలో ఆయన సరసన నటించిన ప్రియాంక సర్కార్‌నే ఆయన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 'లవ్ సర్కస్', 'జుల్ఫికర్', 'బ్యోమకేష్ గొత్రో' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. కేవలం సినిమాలే కాకుండా పలు పాపులర్ టీవీ షోలు, వెబ్ సిరీస్‌ల ద్వారా బెంగాలీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు..
రాహుల్ మరణవార్త విన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "రాహుల్ ఒక అద్భుతమైన నటుడు, మంచి వ్యక్తి. ఆయన మరణం బెంగాలీ కళా రంగానికి తీరని లోటు" అని ఆమె సంతాపం తెలిపారు. పలువురు దర్శకులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా రాహుల్ మృతికి నివాళులర్పిస్తున్నారు. రాహుల్‌కు భార్య ప్రియాంక సర్కార్, 13 ఏళ్ల కుమారుడు సహోజ్ ఉన్నారు. 

ఈ అనూహ్య ఘటన బెంగాలీ సినీ లోకాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఒక మంచి నటుడిగా, రచయితగా, పాడ్‌కాస్టర్‌గా బహుముఖ ప్రజ్ఞ చాటుకున్న రాహుల్ ఇంత చిన్న వయసులో మరణించడం అభిమానులను కలిచివేస్తోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com