
మోహన్ లాల్(Mohan Lal), వర్సెస్ రామ్ చరణ్(Ram Charan).. ఆ వర్సస్ అనే వర్డ్ ని వింటామని బహుశా ఆ ఇద్దరి అభిమనులు అసలు అనుకోని ఉండరు. కానీ బాక్స్ ఆఫీస్ వార్ ఆ పరిస్థితిని కల్పించింది. 'దృశ్యం 3' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డుల వేట సాగిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కుని దాటేసి, మలయాళ చిత్ర పరిశ్రమలోనే అత్యంత వేగంగా ఆ మైలురాయిని అందుకున్న సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ జార్జ్ కుట్టి పై ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ వల్ల థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. రెండు వారాలు తిరక్కుండానే 226.55 కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేసి, ఆల్‌టైమ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ మలయాళ సినిమాల క్లబ్‌లోకి చేరిపోయింది. అయితే, ఇలాంటి టాప్ గేర్‌లో దూసుకుపోతున్న మోహన్ లాల్ కలెక్షన్ల వేగానికి మెగా పవర్ స్టార్ రూపంలో ఊహించని బ్రేక్ పడింది.
'పెద్ది'కి వస్తున్న భారీ ఓపెనింగ్స్, పాజిటివ్ టాక్ కారణంగా అప్పటివరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఏకఛత్రాధిపత్యం వహించిన 'దృశ్యం 3' వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా విదేశీ మార్కెట్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో 'దృశ్యం 3' కలెక్షన్ల వేగం గణనీయంగా తగ్గింది. 16వ రోజు నాటికి 'దృశ్యం 3' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 231.26 కోట్ల రూపాయలకు చేరుకున్నప్పటికీ, మునుపటి రోజులతో పోలిస్తే కలెక్షన్లలో 14 శాతం మేర తగ్గుదల నమోదైంది. కేరళ మినహా మిగిలిన ఏరియాల్లో థియేటర్ల కౌంట్ తగ్గడం, ప్రేక్షకులు చరణ్ నయా లుక్, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్‌తో కూడిన 'పెద్ది' వైపు మొగ్గు చూపడం వల్ల బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్ మారాయి. మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ జోరుకు రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా గట్టి పోటీనిస్తూ గ్లోబల్ మార్కెట్‌లోనూ గట్టి షాక్ ఇచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also read: Peddi: పెద్ది సెకండ్ కలెక్షన్స్ ఇవే!
'పెద్ది' థియేట్రికల్ బిజినెస్ దాదాపు 218 కోట్ల రూపాయల మేర జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సిన భారీ టార్గెట్ ఈ సినిమా ముందుంది. రెండు రోజుల్లోనే 180 కోట్ల గ్రాస్ వరకు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ 'బుక్ మై షో'లో కేవలం ఒక గంట వ్యవధిలోనే 45,000కు పైగా టికెట్లు అమ్ముడవడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. కల్కి 2898 ఏడీ, సలార్, పుష్ప 2 చిత్రాల సరసన నిలిచి, గంటకు 40 వేల టికెట్ల మార్కుని దాటిన నాలుగో తెలుగు చిత్రంగా 'పెద్ది' అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.






