పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రత్యేకమైన ప్రేమకథా చిత్రంగా నిలిచిన ‘తీన్‌మార్’ గురించి దర్శకుడు జయంత్ సి. పరాన్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బాలీవుడ్‌లో సైఫ్ అలీఖాన్ నటించిన ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా తెరకెక్కింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించగా.. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించారు. 2011లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయంత్ మాట్లాడుతూ.. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సినిమా ఆడదని తనకు అర్థమైందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
సినిమా విషయంలో తనకు, త్రివిక్రమ్‌కు సరైన సమన్వయం కుదరలేదని జయంత్ తెలిపారు. ఆ సమయంలో త్రివిక్రమ్ ‘ఖలేజా’ సినిమాతో బిజీగా ఉండటంతో.. ‘తీన్‌మార్’ ప్రాజెక్ట్‌లో తాను ఆయనను కనీసం ఒక్కసారి కూడా కలవలేదని చెప్పారు. తాను కూడా చివరి దశలో దర్శకుడిగా ప్రాజెక్ట్‌లోకి వచ్చానని, దీంతో సినిమా మేకింగ్ సమయంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని వివరించారు. అంతేకాదు.. ‘లవ్ ఆజ్ కల్’ కథ బాలీవుడ్ నేటివిటీకి, అక్కడి ప్రేక్షకుల అభిరుచికి సరిపోయిందని, అదే కథను పవన్ కళ్యాణ్ వంటి భారీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో తెలుగు ప్రేక్షకులకు అందించడం సవాల్‌గా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక సినిమా విడుదలైన తర్వాత ఎదురైన పరిస్థితులను కూడా జయంత్ గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా బెనిఫిట్ షోలు పూర్తయిన తర్వాత కొంతమంది పవన్ అభిమానులు తన ఇంటి ముందు ఆందోళనకు దిగారని చెప్పారు. సినిమాలో హీరోయిన్ పాత్ర మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ హీరో దగ్గరకు రావడాన్ని అభిమానులు ప్రశ్నించారని, క్లైమాక్స్ తమకు నచ్చలేదని చెప్పారని ఆయన వెల్లడించారు. గతంలోనూ జయంత్ ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ‘తీన్‌మార్’కు అడ్డంకిగా మారిందని వ్యాఖ్యానించారు.
అయితే అప్పట్లో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ‘తీన్‌మార్’కు కాలం గడిచే కొద్దీ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పవన్ కళ్యాణ్.. మైఖేల్ వేలాయుధం, అర్జున్ పాల్వాయిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించడం, మణిశర్మ సంగీతం, త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమా ఫలితంపై దర్శకుడు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలతో మరోసారి ‘తీన్‌మార్’ పేరు సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది.
[Pawan Kalyan Teenmaar, Teenmaar Movie, Jayanth C Paranjee, Jayanth C Paranjee Comments, Pawan Kalyan Teenmaar Failure, Teenmaar Movie Director, Trivikram Teenmaar, Trisha Teenmaar, Pawan Kalyan Movies, Telugu Cinema News]




