
పవర్‌స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుండెల్లో కొలువై ఉన్న ఒక చిన్నారి అభిమాని లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పొనుగంటి నిరంజన్ గత కొంతకాలంగా ప్రాణాంతకమైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ, మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ వార్త తెలియడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన అభిమాని ఇక లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక, సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్‌ను షేర్ చేస్తూ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
నిరంజన్ మృతి తన హృదయాన్ని ఎంతగానో కలచివేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల జూన్ 17న హనుమకొండలోని నిరంజన్ ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించిన ఆత్మీయ క్షణాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో చావుబతుకుల మధ్య పోరాడుతున్నప్పటికీ, తనను చూడగానే నిరంజన్ ముఖంలో వెలిగిన ఆ చిరునవ్వు, ఆ కళ్లలోని ఆనందం ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పవన్ కళ్యాణ్ ఎంతో భావోద్వేగంతో రాసుకొచ్చారు. నిరంజన్ శరీరం వ్యాధితో క్షీణిస్తున్నా, అతని మనసు నిండా అపారమైన ధైర్యం, జీవితంపై ఎనలేని ఆశ ఉండేవని, అంత చిన్న వయసులో అతను చూపించిన ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనదని పవన్ కొనియాడారు.
ఆ రోజు హనుమకొండ పర్యటనలో నిరంజన్‌ను పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. ఇద్దరూ కలిసి సెల్ఫీలు కూడా దిగారు. ఆ సమయంలో తనకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని నిరంజన్ కోరగా, 'తప్పకుండా కొని పంపిస్తా' అని మాట ఇచ్చిన పవన్, చెప్పినట్లుగానే అదే రోజు సాయంత్రానికి ఒక ముద్దుల కుక్కపిల్లను నిరంజన్ చేతిలో పెట్టేలా చేశారు. అంతేకాకుండా, తాను 'OG 2' తీస్తే నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని, ఇద్దరం కలిసి సినిమా చూద్దామని నిరంజన్‌కు పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేశారు. కానీ, ఆ సినిమా చూసే భాగ్యం లేకుండానే, ఆ చిన్నారి అంత త్వరగా సెలవు తీసుకోవడం పవన్ అభిమానులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.
చివరి క్షణం వరకు ధైర్యంగా పోరాడిన ఆ ధైర్యవంతుడైన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ తీరని పుత్రశోకాన్ని, సుదీర్ఘ వేదనను భరించే శక్తిని ఆ భగవంతుడు నిరంజన్ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని పవన్ కళ్యాణ్ తన సందేశంలో ప్రార్థించారు. నిరంజన్ పంచిన నిష్కల్మషమైన ప్రేమ, ఆ అమాయకపు చిరునవ్వు తన హృదయంలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Pawan Kalyan, Niranjan, OG 2, TeluguOne






