Home

»

Latest News

Pandu Master: పండు మాస్టర్‌ హెల్త్ అప్‌డేట్.. మళ్లీ డాన్స్ చేయగలరా.. డాక్టర్స్ ఏం చెప్పారు?

Jun 3, 2026 2:26PM

బుల్లితెరపై తనదైన డాన్స్ స్టెప్పులతో, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు (Pandu Master) ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని లొడగలవానిపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌తో పాటు మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర రక్తస్రావంతో ఉన్న పండు మాస్టర్‌ను రాత్రి రెండు గంటల ప్రాంతంలో వైజాగ్‌లోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. (Pandu Master Health Update)

పండు మాస్టర్ ప్రయాణిస్తున్న కారును రోడ్డు పక్కన నిలిపి ఉంచగా.. కోళ్ల లోడ్ తో వస్తున్న వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో అత్యవసర చికిత్స ప్రారంభించారు. 

వైద్య పరీక్షల అనంతరం పండు మాస్టర్ ఎడమ తుంటి ఎముక పూర్తిగా జారిపోయినట్లు గుర్తించారు. అలాగే రెండు కాళ్ల మోకాళ్ల కింద ఉండే టిబియా, ఫిబులా ఎముకలు తీవ్రంగా విరిగాయి. అత్యవసర చికిత్సలో భాగంగా జారిపోయిన తుంటి ఎముకను వైద్యులు తిరిగి యథాస్థానానికి చేర్చారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. విరిగిన రెండు కాళ్ల ఎముకలను అతికించడానికి ప్లేట్లు లేదా రాడ్లు అమర్చి మేజర్ సర్జరీలు చేయడానికి వైద్య బృందం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా కెరీర్‌లో ఉన్న పండు మాస్టర్‌కు తుంటి ఎముక జారిపోవడం కొంత ఆందోళనకరమైన విషయమే అయినప్పటికీ, సకాలంలో వైద్యం అందడం వల్ల భయపడాల్సిన పని లేదని డాక్టర్లు భరోసా ఇచ్చారు. సాధారణంగా వంద మందికి ఇలాంటి ఇంజూరీ జరిగితే కేవలం 2 నుంచి 3 శాతం మందికి మాత్రమే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, పండు మాస్టర్ 90 శాతం కంటే ఎక్కువ విజయవంతంగా కోలుకుని తిరిగి పాత స్థితికి వస్తారని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. నడుము భాగానికి, స్పైనల్ కార్డ్‌కు ఎలాంటి దెబ్బలు తగలకపోవడం పెద్ద ఉపశమనం. ఆయన ముఖంపై కొన్ని చిన్నపాటి గాయాలు అయ్యాయి, వాటికి కుట్లు వేయడం జరిగింది.

అయితే, పండు మాస్టర్ పూర్తిగా కోలుకుని, మళ్లీ స్టేజ్ మీద మునుపటిలా డాన్స్ చేయాలంటే చాలా సమయం పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. జారిపోయిన తుంటి ఎముక పూర్తిగా సెట్ అవ్వడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుంది. కానీ, విరిగిన రెండు కాళ్ల ఎముకలు పూర్తిగా అతుక్కుని, ఆయన మళ్లీ నడవడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి కనీసం 4 నుంచి 6 నెలల పాటు పూర్తి బెడ్ రెస్ట్, చికిత్స అవసరమవుతాయి. ఎముకల శస్త్రచికిత్సల అనంతరం సుదీర్ఘ కాలం పాటు ఫిజియోథెరపీ అందించాల్సి ఉంటుందని, క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేస్తేనే ఆయన కాళ్లు మళ్లీ పాత బలాన్ని పుంజుకుంటాయని డాక్టర్లు పేర్కొన్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com