Padakkalam Review: పడక్కలం మూవీ రివ్యూ
on Jun 11, 2025
మూవీ: పడక్కలం
నటీనటులు: అరుణ్ అజిత్ కుమార్, నిరంజనా అనూప్, సాఫ్ బ్రోస్, పూజా మోహన్ రాజ్, అరుణ్ ప్రదీప్, సందీప్ ప్రదీప్, షర్ఫుద్దీన్, సూరజ్ వెంజరమూడ్ తదితరులు
ఎడిటింగ్: నితిన్ రాజ్
సినిమాటోగ్రఫీ: అనూ మూతేదత్
మ్యూజిక్: రాజేశ్ మురుగేశన్
నిర్మాతలు: విజయ్ బాబు, యోగి జి. రాజ్
దర్శకత్వం: మను స్వరాజ్
ఓటీటీ: జియో హాట్ స్టార్
కథ:
జితిన్ (సందీప్ ప్రదీప్) ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతుంటాడు. అదే కాలేజీలో జీవిక (నిరంజన) ఉంటుంది. జీవిక, జితిన్ ప్రేమించుకుంటారు. వాళ్ల ప్రేమ ఫలించడం కోసం జితిన్ స్నేహితులు ముగ్గురు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అదే కాలేజ్ లో షాజీ (సూరజ్ వెంజరమూడు), రంజిత్ (షర్ఫుద్దీన్) ప్రొఫెసర్లుగా ఉంటారు. ఇద్దరు హెచ్ వోడి పోస్ట్ కోసం చూస్తుంటారు. స్టుడెంట్స్ అంతా కలిసి పాత హెచ్ వోడీని దింపేసి షాజీని ఎన్నుకుంటారు. అయితే అదే సమయలో షాజీ తన ప్రమేయం లేకుండానే ప్రిన్సిపల్ ని ఇతర స్టాఫ్ ని కొడతాడు. దాంతో అతని పదవి పోయి అది తర్వాత స్థానంలో ఉన్న రంజిత్ కి దక్కుతుంది. అయితే షాజీ అలా ప్రవర్తించడానికి కారణం రంజిత్ సర్ అనీ, అతను తన దగ్గరున్న ఒక బోర్డు ఓపెన్ చేసి ఏవో మంత్రాలు చదవడం తను చూశానని ఫ్రెండ్స్ తో జితిన్ అంటాడు. ఆ బోర్డు ద్వారా తము టార్గెట్ చేసిన వ్యక్తిని కంట్రోల్ చేయవచ్చనే విషయం తనకి అర్థమైందని చెప్తాడు. ఆ బోర్డులో ఏవో శక్తలు ఉన్నాయని, అందువల్లనే రంజిత్ సర్ ఆ బ్యాగ్ ని వదిలిపెట్టకుండా తిరుగుతున్నాడని అంటాడు. అతని మాటలను మిగతా మిత్రులంతా నమ్ముతారు. జితిన్ చెప్పినట్టుగా మిగతా మిత్రులంతా కలిసి రంజిత్ సర్ ను ఫాలో అవుతుంటారు. మరి ఆ మాయ బోర్డుని వాళ్ళు దక్కించుకున్నారా? దానికి నిజంగా శక్తులున్నాయా? ఆ బోర్డ్ వల్ల వారి లైఫ్ ఎలా మారిందనేది మిగతా కథ.
విశ్లేషణ:
కాలేజ్ లో సాగే సినిమా కథలేంటే యూత్ కి నచ్చేస్తాయి. వాటిల్లో కంటెంట్ బాగుంటే మరింత క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటి క్రేజ్ ఈ సినిమాకి వస్తుంది. ఎందుకంటే కుర్రాళ్ళ మైండ్ సెట్ తో పాటు వారి భిన్నమైన అభిప్రాయాలని ఈ సినిమాలో చక్కగా చూపించాడు దర్శకుడు మను స్వరాజ్. ఏది ఎక్కడ కావాలో.. ఎంత కావాలో అంతే తీసుకొని.. ల్యాగ్ చేయకుండా సాఫీగా కథని ముందుకు తీసుకెళ్ళాడు దర్శకుడు.
ఆ పజిల్ ని పొందేవరకు కథ కాస్త స్లోగా సాగుతున్న ఫీల్ అనిపించినా .. నలుగురు ఫ్రెండ్స్ మధ్య సాగే సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి. హాలివుడ్ సూపర్ పవర్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ని చూసే వారికి ఇది మాములుగా అనిపించొచ్చు. కానీ తెలుగు ఆడియన్స్ కి ఇలాంటి సినిమా విజువల్ ఫీస్ట్ అనిపించేలా ఉంది. ఎందుకంటే ఇందులో సెంటిమెంట్, భార్యభార్తల మధ్య అనుబంధం, స్నేహం, ప్రేమ, సూపర్ పవర్స్, ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నీ సమపాళ్ళలో ఉన్నాయి. అన్ని పాత్రలు చక్కగా నటించారు.
సినిమా ప్రథమార్థంలో కాలేజ్ లో ఫ్రెండ్స్ మధ్య సాగే సీక్వెన్స్ మినహా ఎక్కడా కూడా స్లో అనిపించదు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఫ్రెష్ కంటెంట్ , క్యారెక్టర్ల నటన అన్నీ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. చివరి ముప్పై నిమిషాలు ఎలా ఫినిష్ అవుతుందనే క్యూరియాసిటి అందరిలో కలుగుతుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ జాగ్రత్తపడ్డారు. అనూ ఫొటోగ్రఫీ బాగుంది. రాజేశ్ మురుగేశన్ సంగీతం ఆకట్టుకుంది. నితిన్ రాజ్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తాయి.
నటీనటుల పనితీరు:
రంజిత్ గా షర్ఫుద్దీన్, షాజీగా సూరజ్ వెంజరమూడు, జితిన్ గా సందీప్ ప్రదీప్, జీవికగా నిరంజన తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : కొత్త పాయింట్ తో సాగే ఈ సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు.
రేటింగ్: 2.75 / 5
✍️. దాసరి మల్లేష్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
