Home

»

Latest News

Oscars 2026: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం.. ఆస్కార్ వేదికపై నివాళులు!

Mar 17, 2026

  • కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం
  • ఆస్కార్ వేదికపై మారుమోగిన కోట పేరు

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై మన టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) పేరు మారుమోగింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 98వ అకాడమీ అవార్డుల వేడుకలో గతేడాది కన్నుమూసిన సినీ ప్రముఖులకు నివాళులర్పించే 'ఇన్ మెమోరియం' విభాగంలో కోటకి చోటు లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన లెజెండరీ నటుడికి దక్కిన ఈ అంతర్జాతీయ గౌరవం పట్ల యావత్ టాలీవుడ్ గర్వపడుతోంది. (Oscars 2026)

98వ ఆస్కార్ వేడుకల సందర్భంగా అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన 'ఇన్ మెమోరియం' జాబితాలో కోట శ్రీనివాసరావు ఫోటోను పొందుపరిచింది. కేవలం కోటనే కాకుండా, భారతీయ సినిమాకు ఎనలేని సేవలు అందించిన దిగ్గజ నటులు ధర్మేంద్ర, మనోజ్ కుమార్,  అభినయ సరస్వతి బి.సరోజాదేవి పేర్లను కూడా అకాడమీ ఈ జాబితాలో చేర్చింది. 

అయితే ఆస్కార్స్ వేడుక ప్రారంభంలో గతేడాది కన్నుమూసిన సినీ ప్రముఖులకు నివాళులర్పిస్తూ ప్రదర్శించిన స్పెషల్ వీడియోలో భారతీయ నటీనటులను చూపించలేదు. సమయాభావం వల్ల ఆస్కార్ వేడుకలో టెలికాస్ట్ చేసిన వీడియోలో కొన్ని పేర్లే ఉన్నప్పటికీ, అధికారిక జాబితాలో మాత్రం మన దేశానికి చెందిన దిగ్గజాలకు చోటు దక్కడం విశేషం. 

కోట శ్రీనివాసరావు జూలై 13, 2025న తన 83వ ఏట తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఉద్యోగి అయిన కోట.. రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొంది, ఆ తర్వాత వెండితెరపై తనదైన ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 750కి పైగా చిత్రాల్లో నటించి.. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నవరసాలు అద్భుతంగా పండించి 'నవరస చక్రవర్తి'గా పేరు తెచ్చుకున్నారు.

ఆస్కార్ 'ఇన్ మెమోరియం' విభాగంలో కోటకు చోటు లభించడంపై టాలీవుడ్ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కోట అభిమానులు ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు. "వెర్సటైల్ యాక్టర్ రేంజ్ ఇది" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టార్లతో పాటు భారతీయ సినీ దిగ్గజాలను కూడా అకాడమీ గుర్తించడంపై సినీ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com