సినిమా రంగంలో అద్భుతాలు సృష్టించడానికి కేవలం భారీ బడ్జెట్, అగ్ర తారలు మాత్రమే అవసరం లేదని.. బలమైన కంటెంట్, సరికొత్త ఆలోచన ఉంటే చాలని ప్రపంచ సినిమాకు మరోసారి నిరూపితమైంది. హాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా మారిన 'అబ్సెషన్' (Obsession) అనే హారర్ చిత్రం ప్రస్తుతం అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
ప్రముఖ యూట్యూబర్ కర్రీ బార్కర్ (Curry Barker) దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 830 కోట్లు) గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాను కేవలం 0.75 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.25 కోట్లు) స్వల్ప బడ్జెట్‌తో, కేవలం 20 రోజుల వ్యవధిలోనే పూర్తి చేశారు.
పెట్టిన పెట్టుబడితో పోలిస్తే వంద రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిన ఈ చిత్రం, ప్రస్తుత 2026 సంవత్సరంలోనే అత్యంత భారీ ప్రాఫిట్స్ అందించిన హాలీవుడ్ మూవీగా చరిత్రకెక్కింది. ఒక సాదాసీదా యూట్యూబర్ తన ప్రతిభతో ఈ స్థాయి గ్లోబల్ వండర్ క్రియేట్ చేయడం వెనుక సినిమాలోని వినూత్నమైన కథాంశమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక యువకుడు తన చిన్ననాటి స్నేహితురాలిని, తను ఇష్టపడే అమ్మాయిని ఎలాగైనా ప్రేమలో దించుకోవాలని అనుకుంటాడు. ఇందుకోసం వింత శక్తులున్న ఒక బొమ్మ సహాయంతో కోరిక కోరగా, ఆ అమ్మాయి అతడికి దగ్గరవుతుంది. అయితే, ఆ తర్వాత ఆమె చూపించే అమితమైన ప్రేమ, పిచ్చి ఎలాంటి భయానక, హింసాత్మక పరిస్థితులకు దారితీసిందనే కాన్సెప్ట్‌తో ఈ హారర్ మిస్టరీని సరికొత్తగా మలిచారు.
ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై విపరీతమైన చర్చ నడుస్తోంది. హారర్ చిత్రాల ప్రియులు ఈ మూవీలోని ట్విస్టులు, భయపెట్టే సన్నివేశాలకు ఫిదా అవుతున్నారు. థియేటర్లలో ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పటికే భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రంపై ఇండియాలోనూ మంచి బజ్ ఏర్పడింది.
ఇక ఇండియన్ హారర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్తూ ఈ సెన్సేషనల్ మూవీ త్వరలోనే భారత్‌లో విడుదల కానుంది. ఇప్పటికే మన దేశ సెన్సార్ బోర్డు (CBFC) నుంచి గ్రీన్ సిగ్నల్ సాధించిన ఈ చిత్రం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో స్పెషల్ నైట్ షోల ద్వారా అలరించడానికి సిద్ధమవుతోంది. హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ సరికొత్త హారర్ డ్రామాను వెండితెరపై వీక్షించేందుకు భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.





