కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' టాలీవుడ్ మరియు కోలీవుడ్ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ విడుదలకు చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది.
ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రంగా నిలిచిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్వాతంత్య్ర
దినోత్సవం (ఆగస్టు 15) లాంగ్ వీకెండ్ సెలవులను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే లక్ష్యంగా చిత్ర యూనిట్ ఈ సాటిలైట్ డేట్‌ను లాక్ చేసింది.
ఇటీవలే 'కరుప్పు' చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్న సూర్య, అదే ఉత్సాహంతో ఈ సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి బ్యాక్-టు-బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ రేట్‌ను సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. క్లాస్, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన బలమైన కథాంశంతో వెంకీ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సూర్య సరసన యంగ్ సెన్సేషన్, మలయాళ బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటించింది. అలాగే సీనియర్ స్టార్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. సూర్య సరికొత్త మేకోవర్, వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటంతో, ఆల్బమ్ పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు రేసులో నిలిచిన ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.




