Home

»

Latest News

'అబ్జెక్షన్ మై లార్డ్' వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా మెప్పించిందా.?

Aug 1, 2026 10:44AM

కోర్టు రూమ్ డ్రామాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అదే జానర్‌లో సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్'. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సిరీస్, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ముఖేష్ రుషి, అనన్య శర్మ, స్నేహాల్ కామత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.

ఈ కథ పరశురామ్ (శ్రీకాంత్) అనే ఒక లాయర్ చుట్టూ తిరుగుతుంది. చట్టంలోని ప్రతి సెక్షన్ పై పూర్తి పట్టు ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆయన కోర్టులో వాదించడానికి దూరంగా ఉంటాడు. కోర్టు ప్రాంగణంలో చెట్టు కింద నోటరీలు రాసుకుంటూ, అందరిచేత ఫెయిల్యూర్ లాయర్‌గా అవమానాలు పొందుతూ జీవనం సాగిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వేద (అనన్య శర్మ) అనే జూనియర్ లాయర్ పరశురామ్ వద్ద అసిస్టెంట్‌గా చేరుతుంది. అదే సమయంలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. నారాయణ అనే ఒక సామాన్యుడు తన కూతురు సమీర (స్నేహాల్ కామత్) కిడ్నాప్‌కు గురైందని, పోలీసులు గానీ, లాయర్లు గానీ తన గోడును పట్టించుకోలేదన్న తీవ్ర మనస్తాపంతో కోర్టు ముందే ఆత్మహత్య చేసుకుంటాడు.

ఈ విచారకర ఘటన పరశురామ్‌ను తీవ్రంగా కలచివేస్తుంది. వ్యవస్థ వైఫల్యానికి బలైన ఆ తండ్రి ఆవేదనను చూసి చలించిన పరశురామ్, ఆ కేసును టేకప్ చేస్తాడు. పైగా, ఓటమే ఎరుగని పవర్ ఫుల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వనాథ్ (ముఖేష్ రుషి)తో.. పరశురామ్‌ న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో సాధారణ నోటరీ లాయర్, పరపతి కలిగిన అపోజిషన్ లాయర్‌ను కోర్టులో ఎలా ఎదుర్కొన్నాడు? అసలు సమీరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

మొత్తం 7 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్.. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా, మరోవైపు ఉత్కంఠభరితమైన కోర్టు వాదనలతో చివరి వరకు ఎంగేజింగ్‌గా నడుస్తుంది. ముఖ్యంగా ఎలాంటి ఓవర్ ది టాప్ సీన్లు, గట్టిగట్టిగా అరుచుకునే సినిమాటిక్ డైలాగులు లేకుండా చాలా రియలిస్టిక్ అప్రోచ్‌తో దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ కథనాన్ని నడిపించారు. మొదటి రెండు ఎపిసోడ్లు పాత్రల పరిచయానికి కాస్త సమయం తీసుకున్నప్పటికీ, నారాయణ కేసు ప్రారంభమైన తర్వాత సిరీస్ వేగం పుంజుకుంటుంది. ఎలాంటి ఆధారాలు లేని ఒక క్లిష్టమైన కేసును సాధారణ నోటరీ లాయర్ తన తెలివితో ఎలా పరిష్కరించాడనే పాయింట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా చివరి మూడు ఎపిసోడ్లు ఆకట్టుకున్నాయి. అయితే విలన్ ట్రాక్ ని, అలాగే శ్రీకాంత్ కోర్టులో వాదించనని భీష్మించుకు కూర్చోవడానికి గల కారణాన్ని ఇంకా బలంగా చుపించాల్సింది. అలాగే క్లైమాక్స్ కూడా ఊహలకు తగ్గట్టుగానే ఉంది.

శ్రీకాంత్ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో పరశురామ్ పాత్రకు ప్రాణం పోశారు. ఫైట్లు, బిల్డప్ సీన్లు లేకుండా ఒక సాధారణ లాయర్‌గా ఆయన ఒదిగిపోయిన తీరు మెప్పించింది. జూనియర్ లాయర్ వేదగా అనన్య శర్మ ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆకట్టుకోగా, ప్రత్యర్థి లాయర్ విశ్వనాథ్‌గా ముఖేష్ రుషి తన సీనియారిటీని నిరూపించుకున్నారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, అరుణ్ చిలువేరు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల మూడ్ ను ఎలివేట్ చేయగా, ఎడిటర్ కిషోర్ ఎపిసోడ్లను ఎక్కడా బోర్ కొట్టకుండా కట్ చేశారు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. 

ఓవరాల్‌గా కమర్షియల్ హంగులకు దూరంగా ఉండే, ఒక డీసెంట్ అండ్ రియలిస్టిక్ కోర్ట్ రూమ్ డ్రామాగా 'అబ్జెక్షన్ మై లార్డ్' ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుంది.

రేటింగ్: 2.75/5

 

Srikanth, Objection My Lord, Web Series, Telugu Review

 

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com