
నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ (CARPENTER) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.
కొరటాల శివ తన ప్రతి సినిమాలోనూ ఒక సామాజిక అంశాన్ని అంతర్లీనంగా చూపిస్తూనే, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ ఎలివేషన్స్ ఇస్తుంటారు. బాలయ్య కోసం ఆయన ఈసారి ఒక విభిన్నమైన బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 'కార్పెంటర్' అనే టైటిల్‌ను బట్టి చూస్తుంటే, ఒక సామాన్యుడు వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దాడు అనే కోణంలో కథ సాగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్. బాలకృష్ణ సినిమాకు అనిరుధ్ తొలిసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే కొరటాల గత చిత్రం 'దేవర'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిరుధ్.. బాలయ్య మాస్ బాడీ లాంగ్వేజ్‌కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తారో అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
బాలకృష్ణ కెరీర్ లో 112వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ను SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2027 సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
బాలకృష్ణ మార్క్ యాక్షన్, కొరటాల శివ మార్క్ రైటింగ్, అనిరుధ్ మ్యూజిక్.. ఈ మూడు కలిస్తే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. ‘కార్పెంటర్’గా బాలయ్య చేసే విన్యాసాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






