English | Telugu

‘నాట్యం’ మూవీ రివ్యూ

on Oct 22, 2021


నాట్యం మూవీ రివ్యూ
తారాగణం: సంధ్యా రాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియ, ఆదిత్య మీనన్, బేబీ దీవెన తదితరులు
పాటలు: కరుణాకర్ అడిగర్ల
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత: సంధ్యా రాజు
కథ, కెమెరా, కూర్పు, దర్శకత్వం: రేవంత్ కోరుకొండ
విడుదల: 22 అక్టోబర్ 2022

సినిమాలు వచ్చిన తర్వాత మోడ్రన్ డాన్స్ యూత్‌ను అట్ట్రాక్ట్ చేసింది. కొన్నాళ్లు మోడ్రన్ డాన్స్ వైపు చాలామంది అడుగులు వేశారు. అయితే, ఈమధ్య సాంప్రదాయ నృత్యం పట్ల ఆకర్షణ మొదలైంది. కొంతమంది పిల్లలకు భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నారు. పుట్టినిల్లు, మెట్టినిల్లు... పారిశ్రామికవేత్తల కుటుంబాలే అయినప్పటికీ, చిన్నతనం నుండి సంధ్యా రాజు కూచిపూడి నేర్చుకున్నారు. కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు సాంప్రదాయ నృత్యం నేపథ్యంలో 'నాట్యం' నిర్మించారు. నిర్మాతగా తొలి సినిమాతో కథానాయికగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఎలా ఉంది?

కథ: 

సితార (సంధ్యా రాజు)ది నాట్యం అనే ఊరు. ఊరిలోని గురువు (ఆదిత్య మీనన్) దగ్గర చిన్నతనం నుండి సితార నాట్యం నేర్చుకుంటుంది. కొన్నేళ్ల క్రితం నాట్యాన్ని బ్రతికించడం కోసం అదే ఊరికి చెందిన కాదంబరి ప్రాణత్యాగం చేస్తుంది. ఆమె కథతో నాట్యకారిణిగా రంగప్రవేశం చేయాలనేది సితార కోరిక. అయితే, గురువు వద్దంటారు. ఆయన ఎందుకు వద్దన్నారు? అయినా... సితార వినదు. కాదంబరి కథను ప్రజలకు చూపించాలని పట్టుదలతో ఉంటుంది. అసలు, కాదంబరి కథేమిటి? సితార లక్ష్యసాధనలో రోహిత్ (రోహిత్ బెహల్), గురువు కుమారుడు హరి (కమల్ కామరాజు) పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

తెలుగులో పునర్జన్మల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. 'నాట్యం' ఓ విధంగా పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన చిత్రమే. నాట్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఓ అమ్మాయి కథను కొన్నాళ్ల తర్వాత అదే రూపురేఖలతో పుట్టిన మరో అమ్మాయి ప్రజలకు ఏ విధంగా తెలియజేసింది అనేది సినిమాలో మెయిన్ పాయింట్. అయితే, ఆ పాయింట్ చెప్పడానికి దర్శకుడు చాలాసేపు వెయిట్ చేశాడు. పతాక సన్నివేశాలకు అరగంట ముందు వరకూ సినిమా రొటీన్ గా సాగింది.

ఓ ఊరిలో సాంప్రదాయ నృత్యపాఠశాలకు సిటీ కుర్రాడు రావడం, ఆమెతో ప్రేమలో పడటం, అనుకోని సంఘటన జరగడంతో ఊరి నుండి వెళ్లడం... మళ్లీ ఊరు రావడం... రెగ్యులర్ రొటీన్ సినిమా టైపులో సాగింది. అందువల్ల, ప్రేక్షకులు పక్కచూపులు చూసే అవకాశం ఎక్కువ. కామెడీ కూడా అంతగా వర్కవుట్ కాలేదు. అయితే, ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి... క్లాసికల్ డాన్స్ బేస్డ్ సాంగ్స్ అన్నీ బావున్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉండుంటే బావుండేది.

శ్రవణ్ భరద్వాజ్ సూపర్బ్ సాంగ్స్ ఇచ్చాడు. రీరికార్డింగ్ కూడా బాగుంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం లేని నాట్యం సినిమాను ఊహించుకోలేం. కరుణాకర్ అడిగర్ల సాహిత్యం కూడా బావుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. ఆ విషయం ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. ఓ పాటలో గ్రాఫిక్స్ కూడా బావున్నాయి.

నటీనటుల పనితీరు:

సాంప్రదాయ నృత్యంలో ప్రావీణ్యం ఉండటంతో... ఆ నేపథ్యంలో తీసిన పాటలు అన్నిటిలోనూ సంధ్యా రాజు చక్కటి నటన కనబరిచారు. సాధారణ సన్నివేశాల్లో ఆమె నటనకు కొత్తగా అనే విషయం తెరపై క్లియర్ గా కనిపించింది. రెగ్యులర్ సీన్స్ చేయడంలో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, కమల్ కామరాజు పాత్రలకు తగ్గట్టు నటించారు. హీరో రోహిత్ అందంగా ఉన్నాడు. కానీ, నటనతో ఆకట్టుకోలేదు. భానుప్రియ రెండు మూడు సన్నివేశాల్లో కనిపించారు. అంతే! మిగతా నటీనటుల్లో గుర్తుపెట్టుకోదగ్గవారు ఎవరూ లేరు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌:

సాంప్రదాయ నృత్యం నేపథ్యంలో సినిమా తీయడం అభినందనీయం. నృత్యం మీద మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నంతో మధ్యలో వెస్ట్రన్ డాన్స్, లవ్ ట్రాక్ వంటివి పెట్టారు. అవేవీ ఆకట్టుకోకపోగా కథకు అడ్డం పడ్డాయి. దాంతో ఫస్టాఫ్ సోసోగా ఉంటుంది. సెకండాఫ్ లో కాదంబరి కథ మొదలైన తర్వాత బావుంటుంది. క్లాసికల్ డాన్స్ కోసమైతే సినిమాకు వెళ్లవచ్చు. 

రేటింగ్: 2/5

- వ‌న‌మాలి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.