Home

»

Latest News

Gaddar Awards: చిరంజీవి రైట్.. నారాయణమూర్తి రాంగ్.. నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్!

Mar 20, 2026

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేదికపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి(R Narayana Murthy) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఏపీలో నంది అవార్డుల పునరుద్ధరణ గురించి వారు చేసిన విజ్ఞప్తులపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనదైన శైలిలో స్పందించారు. 

నట్టి కుమార్ తాజాగా 'తెలుగువన్ సినిమా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్. నారాయణమూర్తిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించడంలో తప్పు లేదని, కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్ర వేదికపై ఉండి మరో రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడటం హుందాతనం అనిపించుకోదని ఆయన పేర్కొన్నారు.

సినిమా ఇండస్ట్రీకి ఏపీ నుంచి 68 శాతం రెవెన్యూ వస్తుందని, కానీ ఇండస్ట్రీ పెద్దలు ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం ఏం చేశారని నట్టి కుమార్ ప్రశ్నించారు. విభజన తర్వాత ఇన్ని ఏళ్లలో ఏపీలో ఒక్క స్టూడియో అయినా కట్టారా? లేదా ఒక్క డబ్బింగ్ థియేటర్ అయినా నిర్మించారా? అని ఆయన నిలదీశారు. కేవలం షూటింగ్‌ల కోసం టూరిస్టుల్లా వెళ్లి వస్తున్నారు తప్ప, అక్కడ శాశ్వత ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు.

మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఆయన ఇండస్ట్రీ ప్రతినిధిగా చాలా హుందాతనంగా మాట్లాడారని నట్టి కుమార్ అన్నారు. చిరంజీవి ఎక్కడా ఎవరినీ తక్కువ చేయలేదని, రెండు రాష్ట్రాల్లోనూ అవార్డులు ఇస్తే కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మాత్రమే చెప్పారని గుర్తు చేశారు. 

అయితే, ఇండస్ట్రీలో కొందరు ద్రోహులు ఉన్నారని, వారు ఏపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పకుండా అడ్డుపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించడానికి పిలిచినప్పుడు ఎంతమంది హీరోలు, నిర్మాతలు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వైపు నుంచి సానుకూలత ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ పెద్దలే వెనకాడుతున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. 

ఏపీలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలంటే కేవలం అవార్డులు మాత్రమే సరిపోవని, మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి పెట్టాలని నట్టి కుమార్ చేసిన సూచనలు చర్చనీయాంశంగా మారాయి.

Also Read: బుజ్జితల్లితో విజయ్-రష్మిక క్యూట్ మూమెంట్!

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com