
తెలుగు సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (TFPC) జాయింట్ సెక్రటరీ పదవికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు కౌన్సిల్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు ఆయన ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో కౌన్సిల్ పనితీరుపై ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
నట్టి కుమార్ తన రాజీనామా లేఖలో కౌన్సిల్ పరిపాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించారు. పర్సెంటేజ్ విధానాన్ని హ్యాండిల్ చేయడంలో కౌన్సిల్ విఫలమైందని, దీనివల్ల ఎగ్జిబిటర్లు పైచేయి సాధిస్తుంటే చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, గిల్డ్ పెత్తనం సాగడం వంటి అంశాలను ఆయన ఎండగట్టారు.
కౌన్సిల్‌లో ప్రజాస్వామ్యం కరువైందని, ఎన్నికలు లేదా నిబంధనలు లేకుండానే సంస్థ కొనసాగుతోందని నట్టి కుమార్ ఆరోపించారు. పరిపాలన, ఆడిటింగ్, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, జవాబుదారీతనం లేని చోట తాను పదవిలో కొనసాగడం అర్థరహితమని ఆయన స్పష్టం చేశారు. కనీసం తన రాజీనామా తర్వాత అయినా సభ్యులందరూ మేల్కొని, సంస్థను వృత్తిపరంగా, పారదర్శకంగా నడపాలని ఆయన కోరారు.
నట్టి కుమార్ రాజీనామాపై నిర్మాత మండలి ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, పరిశ్రమలో చిన్న నిర్మాతల పక్షాన నిలిచే వ్యక్తిగా పేరున్న నట్టి కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం, మండలిలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.





