Home

»

Latest News

నంది అవార్డుల పునరుద్ధరణపై స్పందించిన నిర్మాత‌ల మండ‌లి.!

Oct 3, 2026 1:55PM

2017 నుంచి 2024 వరకు నిలిచిపోయిన నంది ఫిల్మ్ అవార్డులను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఏపీ స్టేట్ ఫిల్మ్, టీవీ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి. భరత్ భూషణ్, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్‌లకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది.

ఇటీవల 2026 సెప్టెంబర్ 24న ఏపీ ఎఫ్‌డీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించిన లేఖలోని అభ్యర్థనలను పరిశీలించి.. గోల్డెన్ నంది, సిల్వర్ నంది, బ్రాంజ్ నంది అనే మూడు విభాగాల్లో అవార్డులను తిరిగి నిర్వహించేందుకు అంగీకరించినట్లు నిర్మాతల మండలి తెలిపింది. అలాగే 2017-2024 సంవత్సరాలకు సంబంధించిన ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును కూడా పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఈ అవార్డుల ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గుర్తించి సత్కరించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

1964లో ప్రారంభమైన నంది ఫిల్మ్ అవార్డులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల సంస్కృతితోనూ ప్రత్యేక అనుబంధం ఉందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పేర్కొంది. ఇన్నేళ్లుగా సినీ రంగంలోని కళాకారులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారికి అవార్డులు అందించడం ద్వారా పరిశ్రమను ప్రోత్సహించే సంప్రదాయం కొనసాగిందని తెలిపింది. నంది అవార్డుల పునరుద్ధరణతో తెలుగు సినీ రంగానికి చెందిన ప్రతిభావంతులను మరోసారి అధికారికంగా సత్కరించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులను నంది అవార్డుల ద్వారా గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి పార్టీలను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోరింది. నంది అవార్డుల పునరుద్ధరణకు సంబంధించిన నిర్ణయాన్ని సినీ పరిశ్రమకు సంబంధించిన వర్గాలు స్వాగతిస్తున్నాయని తెలిపింది.

 

 

[Nandi Film Awards, Nandi Awards 2017-2024, Nandi Awards Revival, Telugu Film Producers Council, Andhra Pradesh Nandi Awards, Golden Nandi Award, Silver Nandi Award, Bronze Nandi Award, NTR National Film Award, Nandi Awards Latest News, Telugu Cinema Awards, AP Film Awards]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com