Home

»

Latest News

‘చ‌ట్ట‌ప‌రంగా ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌ను’.. ‘చుట్టమల్లే’ ఎఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.!

Oct 3, 2026 1:50PM

ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళలను అవమానించేలా మార్ఫింగ్ వీడియోలు రూపొందించడంపై యంగ్ హీరో ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. మహిళలను తల్లులు, దేవతలుగా గౌరవించే సంస్కృతి మనదని, అలాంటి సమాజంలో ఏఐని ఉపయోగించి ఒక మహిళను అత్యంత దారుణంగా అవమానించేలా కంటెంట్ తయారు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి దుష్ట చర్యలకు పాల్పడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తన స్పందనను వెల్లడించారు.

తన పాటకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను రూపొందించిన వారితో పాటు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టను. వీడియోను తయారు చేసిన వారితో పాటు దాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రతి ఒక్కరిపై సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’’ అంటూ హెచ్చరించారు. అదే సమయంలో ఇలాంటి వీడియోలను ఎవరూ చూడొద్దని, షేర్ చేయొద్దని, వాటితో ఎలాంటి విధంగానూ ఎంగేజ్ కావొద్దని అభిమానులు, నెటిజన్లను కోరారు.

ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించడం వల్ల దాని బారిన పడేది ఎవరైనా కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మరొక మహిళకు సంబంధించిన వీడియో కావచ్చు.. రేపు అది మన తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తెకు సంబంధించినదై ఉండొచ్చని అన్నారు. అందుకే ఏఐ దుర్వినియోగంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్ వైరల్ కావడానికి నెటిజన్లు కూడా కారణం కాకూడదని, వాటిని షేర్ చేయకుండా రిపోర్ట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్‌ఫేక్, మార్ఫింగ్ కంటెంట్‌కు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ కోరారు. ఇలాంటి ఘటనలను అడ్డుకునేలా కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

 

 

[Jr NTR, NTR AI Morphed Video, Chuttamalle AI Video, Chuttamalle Morphed Video, Jr NTR Latest News, NTR Social Media Post, AI Misuse, AI Deepfake Video, NTR Chuttamalle Song, NTR Reaction, AI Morphed Video Controversy]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com