
సినిమా అనేది పూర్తిగా వ్యాపార కోణంలో చూడాల్సిన విషయం. ఎంత పెట్టుబడి పెట్టాం? చివరికి ఎంత మిగిలింది? అనే లెక్కలే హిట్టూ, ఫ్లాపులను తేల్చేసే విషయాలు. బాగా ఆడుతుందని, లాభాలొస్తాయని నమ్మే ఓ సినిమా తీస్తారు. విడుదల ముందు వరకూ అదే నమ్మకం వాళ్లని నడిపిస్తుంది. విడుదలయ్యాకనే హిట్టా? ఫ్లాపా అనే విషయాలు తెలుస్తాయి. సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్‌తో సినిమా అమ్ముకొంటే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. సినిమా విడుదలకు ముందే.. నష్టాలొస్తే అంత కంటే దురదృష్టమూ ఇంకోటి ఉండదు. ప్రస్తుతం కల్యాణ్ రామ్ ఇజంకీ ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితే వచ్చింది. కల్యాణ్‌రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొన్న చిత్రం ఇజం. దాదాపుగా రూ.25 కోట్ల వ్యయంతో తెరకెక్కిన చిత్రమిది. విడుదలకు ముందే ఈ సినిమాని అమ్మేశారు. ఎవరైనా ఓ వస్తువుని లాభానికి అమ్ముకొని సొమ్ము చేసుకొంటారు. కానీ ఈ సినిమాని మాత్రం నష్టాలకు అమ్ముకోవాల్సివచ్చింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రానికి రూ.16 కోట్లకు మించి రాలేదని టాక్. శాటిలైట్ హక్కులతో మరో రూ.3 కోట్ల వరకూ వచ్చినా ఈ సినిమా రూ.19 కోట్లే తిరిగి రాబటగ్టుకొన్నట్టు. అంటే మిగిలినదంతా నష్టమే అన్నమాట. విడుదలయ్యాక ఈ సినిమా పరిస్థితి ఏంటో, ఎలా ఉంటుందో తెలియని అయోమయంలో ఉండడం వల్లే నష్టాలకు ఈ సినిమాని వదిలించుకోవాల్సివచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాపై అంత నమ్మకం ఉంటే.. సొంతంగా రిలీజ్ చేసుకొందురు కదా?? అదీ పాయింటు.




.jpg)

