Home

»

Latest News

నానా పటేకర్ రియల్ హీరో: కార్గిల్ యుద్ధంలో 60 రోజులు ఏం చేశారంటే.?

Oct 8, 2026 12:57PM

సినిమాల్లో సైనికుడి పాత్రలు చేయడం వేరు.. నిజ జీవితంలో సైనికులతో కలిసి యుద్ధ ప్రాంతంలో పనిచేయడం వేరు. నటుడిగా తెరపై ఎన్నో పవర్‌ఫుల్ పాత్రలు చేసిన నానా పటేకర్.. రియల్ లైఫ్‌లో కూడా దేశం కోసం తనవంతు సేవ చేశారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో దాదాపు 60 రోజుల పాటు ఆర్మీ సైనికులతో కలిసి పనిచేశారు.

నానా పటేకర్ గురువారం ఉదయం 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు CPR చేసినా ఆయనను కాపాడలేకపోయారు.

నానా పటేకర్ మరణవార్తతో ఆయన సినీ ప్రయాణంతో పాటు.. చాలామందికి తెలియని కార్గిల్ అధ్యాయం కూడా ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది.

నిజానికి నానా పటేకర్‌కు ఆర్మీతో అనుబంధం ముందే ఉంది. ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ సినిమా కోసం ఆయన మరాఠా లైట్ ఇన్‌ఫ్యాంట్రీతో దాదాపు మూడేళ్ల పాటు కఠినమైన మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సినిమాలో ఆర్మీ అధికారి పాత్ర పోషించడమే కాకుండా.. దర్శకత్వం కూడా వహించారు.

ఇక 1999లో కార్గిల్ యుద్ధం మొదలైనప్పుడు.. దేశం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నానా పటేకర్ అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను సంప్రదించారు. తాను కమాండో ట్రైనింగ్ తీసుకున్న విషయాన్ని, ఆయుధాల వినియోగంలో తనకు ఉన్న అనుభవాన్ని, జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్‌లో పాల్గొన్న విషయాన్ని ఆయన వివరించారు. ఆ తర్వాత ప్రత్యేక అనుమతితో ఆర్మీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 

అలా 1999 ఆగస్టులో నానా పటేకర్ కార్గిల్ ప్రాంతానికి వెళ్లారు. ద్రాస్, లెహ్, కుప్వారా, బారాముల్లా, సోపోర్ వంటి సున్నిత ప్రాంతాల్లో సైనికులతో కలిసి దాదాపు 60 రోజులు గడిపారు. ఆయన క్విక్ రియాక్షన్ టీమ్‌లో కూడా భాగమయ్యారని స్వయంగా వెల్లడించారు. అయితే అక్కడ తాను చేసిన ఆపరేషనల్ కార్యకలాపాల వివరాలను మాత్రం నానా పటేకర్ బయటపెట్టలేదు.

ఈ అనుభవం ఆయనపై ఎంత ప్రభావం చూపిందో చెప్పడానికి మరో విషయం ఉంది. శ్రీనగర్‌కు వెళ్లేటప్పుడు తన బరువు 76 కిలోలు ఉండగా.. తిరిగి వచ్చేసరికి 56 కిలోలకు తగ్గిపోయిందని నానా పటేకర్ గతంలో చెప్పారు. అంటే కార్గిల్‌లో గడిపిన సమయంలో దాదాపు 20 కిలోల బరువు తగ్గారన్నమాట.

ఇంతటి అనుభవం ఉన్నప్పటికీ నానా పటేకర్ మాత్రం దాన్ని ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. దేశం కోసం తాను చేయగలిగిన చిన్న పని చేశాననే భావనతోనే ఈ విషయాన్ని చూశారు. అందుకే ఆయన కార్గిల్ అనుభవం కూడా చాలా కాలం పాటు పెద్దగా బయటకు రాలేదు.

నానా పటేకర్ మరణం తర్వాత ఆయన నటుడిగా చేసిన సినిమాలు మాత్రమే కాదు.. దేశం కోసం చేసిన ఈ అరుదైన సేవ కూడా గుర్తుచేసుకోవాల్సిన అంశమే. తెరపై సైనికుడి పాత్రలో జీవించిన నానా.. నిజ జీవితంలోనూ సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు గడపడం ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని చూపిస్తోంది.

ఇది కూడా చదవండి: ప్యారడైజ్ రిజల్ట్.. శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి చెప్పిన మాట ఇదే.!

 

 

 

[Nana Patekar Kargil War, Nana Patekar Indian Army, Nana Patekar Passed Away, Nana Patekar Death, Nana Patekar Life Story, Nana Patekar Biography, Nana Patekar Movies, Nana Patekar, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com