
టాలీవుడ్ లో ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విభిన్నమైన కథాంశాలతో, సరికొత్త విజువల్స్ ని జోడించి వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఒక భారీ మైథలాజికల్ ఫాంటసీ మరియు మిస్టరీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషన్ చిత్రం 'నాగబంధం' (Nagabandham).
అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అదిరిపోయే అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాను జూలై 3, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

తాజాగా విడుదలైన ఈ అఫీషియల్ పోస్టర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతోంది. "ప్రతి ముఖం వెనుక ఒక కథ దాగి ఉన్నప్పుడు... ప్రతి నీడ ఒక రహస్యాన్ని కాపాడుతున్నప్పుడు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వచ్చిన ఈ లుక్ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తోంది. పోస్టర్ లో రా రగ్గడ్ లుక్‌లో ఇంటెన్స్ కళ్లతో చూస్తున్న విరాట్ కర్ణ అరాచకంగా కనిపిస్తున్నాడు. అతని మెడలో చుట్టుకుని ఉన్న నల్లత్రాచు పాము, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న పురాతన కోటలు, మండుతున్న అగ్ని జ్వాలలు, నాగుపాములు సినిమాలోని మిస్టరీ ఎలిమెంట్స్‌ని పీక్స్‌కి తీసుకువెళ్లాయి.
ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా, నభా నటేష్, దక్ష నగార్కర్, ఇషీ మీనన్ ముఖ్య పాత్రల్లో మెరిసిపోతున్నారు. నెగిటివ్ షేడ్స్ లో రిషబ్ సాహ్ని పోస్టర్‌లో భయంకరమైన బ్లడీ లుక్‌తో కనిపిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, గరుడ రామ్ తదితరులు తమదైన ఇంటెన్స్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు.
చుట్టూ నాగుపాములు, ఒకవైపు సముద్రపు అలల మధ్య తుపాకీ పట్టుకుని బోటులో వస్తున్న వ్యక్తి, మరోవైపు కోట్ల విలువైన గుప్త నిధులు, బంగారు నాణేల రాశి మధ్య నిలబడి ఉన్న క్యారెక్టర్లు చూస్తుంటే ఇదొక హై-వోల్టేజ్ నిధుల వేట (Treasure Hunt) నేపథ్యంతో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.





