.jpg)
ఈ రోజుల్లో ఓ సినిమాకి హిట్ టాక్ రావడమే గగనం. తొలిరోజే హిట్ టాక్ సంపాదించుకొందంటే.. ఆ సినిమాకి వసూళ్ల పంట పండినట్టే. ప్రేమమ్ సినిమాకీ అలానే యునానిమస్ గా హిట్ టాక్ దక్కింది. పైగా.. దసరా సీజన్‌లో విడుదలైన సినిమా ఇది. యూత్ కి బాగా పట్టేసే లవ్ స్టోరీతో తయారైన కథ. మరి వసూళ్లు ఏ రేంజులో ఉండాలి? చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని, కనీసం రూ.30 కోట్లయినా వసూలు చేస్తుందని అంతా భావించారు. కానీ.. ప్రేమమ్ టాక్‌కీ, వచ్చిన వసూళ్లకూ ఎక్కడా పొంతన లేకుండా పోయింది.
ఈ సినిమాకి దాదాపు రూ.19 కోట్ల బిజినెస్ జరిగింది. ఖర్చులు, పబ్లిసిటీ కలుపుకొని.. 22 కోట్ల వరకూ రావాలి. అయితే ఇప్పటి వరకూ ఈసినిమాకి రూ.16 కోట్లే దక్కాయట. అంటే.. మరో ఆరు కోట్లు బాకీ! ఈ సినిమా నిర్మాతలకు శాటిలైట్ ద్వారా ఆదాయం వస్తుందని కాబట్టి... వాళ్లు నాలుగు రాళ్లు వెనకేసుకొన్నారు. కానీ ఈ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం కనీసం 20 శాతం నష్టపోవడం ఖాయం. ఇంత మంచి టాక్ వచ్చాక కూడా నష్టాల్ని మూటగట్టుకొన్న సినిమా ఈమధ్య కాలంలో ఇదేనేమో?? నాగచైతన్యకి మాస్‌లో పట్టులేకపోవడంతో... ఈ సమస్య వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా వసూళ్లు కొల్లగొట్టే ఓ మంచి అవకాశాన్ని చైతూ జారవిడచుకొన్నాడు.






