Home

»

Latest News

ముందు నా కొడుక్కి ఓటెయ్యి.. త‌ర్వాత నీ మాట‌ల‌కు స‌మాధాన‌మిస్తా!

Sep 27, 2021 10:53AM

 

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ జోలికి రావ‌ద్ద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ పెద్ద‌ల‌కు చెప్ప‌మంటూ మోహ‌న్‌బాబును ప‌వ‌న్ క‌ల్యాణ్ కోరిన విష‌యం తెలిసిందే. త‌న మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన 'రిప‌బ్లిక్' మూవీ ప్ర‌మోష‌నల్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వంపైనా, వైసీపీ నాయ‌కుల‌పైనా తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ఏపీలో చిత్రపరిశ్రమ పట్ల జరుగుతున్న అంశాలపై మోహన్ బాబు స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. "వైఎస్ఆర్ కుటుంబీకులు మీ బంధువులు కదా. కావాలంటే పవన్ కళ్యాణ్‌ ను బ్యాన్ చేసుకోండి. చిత్రపరిశ్రమ జోలికి మాత్రం రావొద్దు అని మీరు వైసీపీ పెద్దలకు చెప్పండి. ఇవాళ చిత్రపరిశ్రమకు అమలు చేసిన చేసిన రూల్స్‌.. రేపటి రోజున మీ విద్యానికేతన్ స్కూళ్లకు కూడా అప్లై చేయొచ్చు. ఈ విషయాన్ని గుర్తెరిగి స్పందించండి." అంటూ పవన్ సంచలన కామెంట్స్ చేశారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌పై మోహ‌న్‌బాబు స్పందించారు. అయితే మా ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 10న జ‌రుగుతున్నందున అవి అయిపోయాక ప‌వ‌న్ అడిగిన ప్ర‌తి మాట‌కూ స‌మాధాన‌మిస్తాన‌ని ఆయ‌న అన్నారు. ఈలోగా మా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న త‌న కుమారుడు మంచు విష్ణుకు, అత‌ని ప్యాన‌ల్‌కు ఓటువేసి గెలిపించాల‌ని కోరారు.

త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో ఈ మేర‌కు ఓ నోట్‌ను మోహ‌న్‌బాబు పోస్ట్ చేశారు. "మై డియ‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు" అని సంబోధించిన ఆయ‌న‌ "నా చిర‌కాల మిత్రుని సోద‌రుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్ నువ్వు నాకంటే చిన్న‌వాడివి. అందుక‌ని ఏక‌వ‌చ‌నంతో సంబోధించాను. ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు అన‌డంలో కూడా త‌ప్పేమీ లేదు. చాలా కాలానికి న‌న్ను మెల్ల‌గా లాగావ్‌. సంతోష‌మే. ఇప్పుడు మా ఎల‌క్ష‌న్స్ జ‌రుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌గా నిల‌బ‌డ్డాడు అనే సంగ‌తి నీకు తెలిసిందే. అక్టోబ‌ర్ 10వ తేదీన ఎల‌క్ష‌న్స్ అయిపోతాయి. ఆ త‌ర్వాత నువ్వు అడిగిన ప్ర‌తిమాట‌కి నేను హృద‌య‌పూర్వ‌కంగా స‌మాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయ‌వ‌ల‌సిన ముఖ్య‌మైన ప‌ని.. నీ అమూల్య‌మైన ఓటుని నీ సోద‌ర స‌మానుడైన విష్ణుబాబుకి, అత‌ని ప్యాన‌ల్‌కి వేసి వాళ్ల‌ని గెలిపించాల‌ని కోరుకుంటున్నాను. థాంక్యూ వెరీ మ‌చ్‌.. మోహ‌న్‌బాబు" అని ఆ నోట్‌లో రాశారు.

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న ప‌రిస్థితి చూస్తుంటే 'మా' ఎన్నిక‌ల వ్య‌వ‌హారంతో పాటు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమాల విష‌యంలో అనుస‌రిస్తోన్న వైఖ‌రి విష‌యంలోనూ ఇండ‌స్ట్రీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయేట‌ట్లు క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను నాని లాంటి హీరోలు స‌మ‌ర్థిస్తుంటే, సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన అత్యున్న‌త బాడీ ఫిల్మ్‌చాంబ‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యాల‌కూ, ఇండ‌స్ట్రీకీ సంబంధం లేద‌ని చెప్ప‌డం, ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ టికెట్ అమ్మ‌కాల ప‌ద్ధ‌తి లాంటి వాటిని స‌మ‌ర్థించ‌డం గ‌మ‌నార్హం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com