Home

»

Latest News

"మేము" సినిమా రివ్యూ!

Jul 8, 2016 2:12PM

 

నటీనటులు: 

సూర్య, అమలపాల్, బిందుమాధవి, మాస్టర్ నిశేష్, బేబీ వైష్ణవి తదితరులు.. 

 

సాంకేతికవర్గం: 

సంగీతం: అర్రోల్ కరెల్లి 

ఛాయాగ్రహణం: బాలసుబ్రమణియం 

మాటలు: శశాంక్ వెన్నెలకంటి 

సమర్పణ: సూర్య 

నిర్మాత: జూలకంటి మధుసూధన్ రెడ్డి 

రచన-దర్శకత్వం: పాండిరాజ్ 

విడుదల తేదీ: 8/7/2016 

 

చప్పట్లు కొట్టించే సినిమాలుంటాయి, వయసును కవ్వించే సినిమాలుంటాయి. కానీ.. మనసుకు ఆహ్లాదాన్ని పంచే సినిమాలు మాత్రం చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన చిత్రమే "మేము". సూర్య నటించడంతోపాటు నిర్మాణ భావస్వామిగానూ వ్యవహరించిన ఈ చిత్రం తమిళంలో గతేడాది విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకొంది. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు (జూలై 8) తెలుగులో విడుదలైంది. "మేము" సినిమా ద్వారా పాండిరాజ్-సూర్య ప్రేక్షకులకు ఏం చెప్పదలచుకొన్నారో చూద్దాం..!!

కథ: 

కథగా చెప్పడానికి వీలుకాని సినిమా "మేము". సినిమా చూసి ఆస్వాదించాల్సిన అనుభూతులు కోకొల్లలుగా ఉన్న ఈ చిత్రం కథ మొత్తం ఇద్దరు పిల్లల చుట్టూ తిరుగుతుంటుంది. నవీన్ (మాస్టర్ నిశేష్), నైనా (బేబీ వైష్ణవి) ఇద్దరూ అల్లరి పిల్లలు. వీళ్ళ అల్లరి కారణంగా రెండో క్లాసుకే నాలుగు స్కూళ్ళు మారతారు. వాళ్ళు అలా స్కూళ్ళు మారడం వలన ఆ పిల్లల తల్లిదండ్రులు చాలా ఇబ్బందికి గురవుతుంటారు. దాంతో.. ఆ పిల్లలిద్దరినీ హాస్టల్ లో చేర్పిస్తారు. హాస్టల్ లో ఉండడం ఇష్టం లేని నవీన్-నైనాలు.. హాస్టల్ లో విపరీతమైన అల్లరి చేసి అక్కడ్నుంచి బయటపడతారు. పిల్లల కారణంగా తమ పరువు పోయిందని.. ఇద్దరి పిల్లల్నీ చితక్కొట్టేసి వారి కోపాన్ని తీర్చుకొంటారు. 

సరిగ్గా అదే సమయంలో ఆ పిల్లల్ని చూసిన డాక్టర్ రామనాధం (సూర్య) మరియు అతని భార్య పద్మ (అమలాపాల్). స్వతహా పిల్లల డాక్టర్ అయిన రాము.. ఆ పిల్లలకి ఎటువంటి సమస్య లేదని, కేవలం ఎనర్జీటిక్ గా ఉంటున్నారని వాళ్ళ తల్లితండ్రులకు నచ్చ చెబుతాడు. 

రామనాధం ఇచ్చిన ట్రీట్ మెంట్ నవీన్-నైనా మరియు వాళ్ళ తల్లిదండ్రుల జీవితాల్లో ఎటువంటి మార్పు తీసుకువచ్చింది? అనేది "మేము" సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం..!!

 

 

నటీనటుల పనితీరు: 

అల్లరి పి‌ల్లలుగా నటించిన మాస్టర్ నిశేష్ మరియు బేబీ వైష్ణవి "మేము" సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి చేష్టల్లో చిలిపిదనం, వారి మాటల్లో అమాయకత్వం చూస్తున్న మనకు వారు నటిస్తున్నారన్న విషయం కూడా గుర్తుకురాదు. ఫస్టాఫ్ మొత్తం వారి అల్లరిని ఆస్వాదించిన ప్రేక్షకులకు.. సెకండాఫ్ లో వారి అభినయం చూశాక కళ్ళు చెమర్చక తప్పదు. 

డాక్టర్ రామనాధం పాత్రలో సూర్య జీవించేశాడు. పిల్లల్ని ఎలా లాలించాలో, బుజ్జగించాలో, ఎలా మచ్చిక చేసుకోవాలో చెప్పిన తీరు ప్రశంసనీయం. అతని భార్య పాత్రలో అమలాపాల్ చక్కని నటన కనబరిచింది. ఇక పిల్లల తల్లిదండ్రులుగా రాందాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్ మరియు బిందుమాధవిలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

సాంకేతికవర్గం పనితీరు: 

ముందుగా కెమెరామెన్ బాలసుబ్రమణియం గురించి చెప్పుకోవాలి, అసలు నటనంటే తెలియని పిల్లల హావభావాలను కెమెరా కంట్లో బంధించడంలో వందశాతం విజయం సాధించడంతోపాటు.. ఆ అల్లరిని, ఆనందాన్ని ప్రేక్షకులకు కూడా పంచాడు. 

సంగీత దర్శకుడు అర్రోల్ కరెల్లీ స్వరపరిచిన బాణీలు వినసోంపుగా ఉండగా.. నేపధ్య సంగీతం ప్రేక్షకుడ్ని సినిమాలో లీనం చేయడంలో కీలకపాత్ర పోషించింది. 

శశాంక్ వెన్నెలకంటి సమకూర్చిన సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి. ముఖ్యంగా సూర్య చెప్పిన మాటలు ప్రెజంట్ జనరేషన్ పేరెంట్స్ ను ఆలోచింపజేస్తాయి. 

దర్శకుడు పాండిరాజ్ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడని అర్ధమవుతుంది. అతను సినిమా ద్వారా చెప్పాలనుకొన్న విషయాలేమిటంటే.. 

1) పిల్లలు కడుపులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల వ్యవహార శైలిని బట్టి పిల్లలు పుట్టాక వారి బిహేవియర్ ఆధారపడి ఉంటుంది.

2) విద్య అంటే కేవలం పుస్తక జ్ణానం మాత్రమే కాదు లోకజ్ణానం కూడా. 

ఈ రెండు విషయాలను దర్శకుడు చెప్పిన విధానం బాగున్నప్పటికీ.. ఈ విషయాలను ఆడియన్స్ మైండ్ లో రిజిష్టర్ చేసే స్థాయిలో అర్ధవంతంగా తెరకెక్కించలేకపోయాడు. సెకండాఫ్ దాదాపుగా హిందీ సినిమా "తారే జమీన్ పర్" చిత్రాన్ని తలపిస్తుంది. దర్శకుడిగా కంటే కథకుడిగా పాండిరాజ్ ఈ చిత్రంలో ఎక్కువ మార్కులు సంపాదించుకొన్నాడు. అలాగే.. పిల్లల నుంచి ఓపికతో అద్భుతమైన నటనను రాబట్టిన తీరును మెచ్చుకోవాల్సిందే. 

 

విశ్లేషణ: 

మొదట పేర్కొన్నట్లుగా.. "మేము" మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సినిమా. సినిమా చూస్తున్నంతసేపు మనస్ఫూర్తిగా ఆస్వాదించి.. థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు మాత్రం ఆలోచిస్తూ అడుగులు వేసుకుంటూ వచ్చేస్తుంటాం. చిన్న పిల్లల స్వచ్చమైన హావభావాలు, సూర్య అద్భుతమైన నటన, ఆలోచింపజేసే పాత్రధారుల వ్యవహారశైలి.. అన్నీ కలగలిసి "మేము" సినిమాను తప్పక చూడదగ్గ చిత్రంగా మలిచాయి. 

రేటింగ్: 3/5 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com