మెగాస్టార్ సినిమా విషయంలో అనిల్ రావిపూడి స్ట్రాటజీ అదిరిందిగా!
on Mar 17, 2025
‘పటాస్’తో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి తన మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకొని ఆ తర్వాత వరస హిట్స్‌తో ముందుకు దూసుకెళ్తున్నాడు. అతని సినిమాల్లోని కామెడీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ఇప్పటివరకు అతని నుంచి వచ్చిన సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో, ఫైట్స్‌తో మాస్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకునే చిరంజీవి.. కామెడీతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తారు. ఈ విషయం అనేక సినిమాల ద్వారా ప్రూవ్ అయింది. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులకు నవ్వుల పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న విశ్వంభర షూటింగ్ పూర్తయింది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు చిరు. అందుకే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ను స్టార్ట్ చేసేశాడు. అనిల్ రావిపూడి మేకింగ్ విషయంలో చాలా ఫాస్ట్‌గా ఉంటాడని అందరికీ తెలుసు. గతంలో మహేష్‌తో చేసిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఇప్పటివరకు మహేష్ సినిమాను అంత త్వరగా పూర్తి చేసిన దర్శకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. అలాగే ఎఫ్3 చిత్రాన్ని కూడా అంతే స్పీడ్‌తో పూర్తి చేశారు. మెగాస్టార్, అనిల్ కాంబినేషన్లో రూపొందే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా మొదట స్క్రిప్ట్‌ని ఫైనల్ చేసుకున్న తర్వాత పాటల రికార్డింగ్ మీద దృష్టి పెడతారు. కానీ, దానికి భిన్నంగా ఓ వైపు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగానే భీమ్స్‌తో నాలుగు పాటలు కంపోజ్ చేయించారు. సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడంటే.. షూటింగ్ స్టార్ట్ అయితే యూనిట్ మెంబర్స్‌ని పరుగులు పెట్టించడం ఖాయం అంటున్నారు.
ఇదిలా ఉంటే.. సంక్రాంతికి బ్లాక్ బస్టర్స్ సాధించిన ఘనత చిరంజీవికి ఉంది. అలాగే డైరెక్టర్‌గా అనిల్ కూడా 4 సంక్రాంతి విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి సంక్రాంతి పైనే కన్నేశాడు. వచ్చే ఏడాది అంటే 2026 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తయింది. తాజాగా సింహాచలం శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని స్క్రిప్ట్‌ను స్వామి వారి సన్నిధిలో ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు అనిల్. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు ఆయన మాటల ద్వారా తెలిసింది. సంక్రాంతికి విడుదల చేసిన అనిల్ సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అనిల్ అనుకున్నట్టుగానే అన్నీ జరిగితే మెగాస్టార్ చిరంజీవి సినిమాను 2026 సంక్రాంతి బరిలోకి దింపే అవకాశం ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
