గ్లామర్ ప్రపంచంగా వెలిగిపోయే చిత్ర పరిశ్రమ వెనుక ఎన్నో చీకటి కోణాలు, నిశ్శబ్ద యుద్ధాలు దాగి ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ముఖ్యంగా వెండితెర వెనుక జరిగే అన్యాయాలపై, లైంగిక వేధింపులపై గళమెత్తే నటీమణులకు ఇండస్ట్రీలో సరైన ఆదరణ లభించడం లేదు సరికదా, వారిపై అప్రకటిత నిషేధం విధిస్తున్నారనే ఆందోళనకరమైన నిజాలు ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వ్యవస్థలోని లొసుగులను ప్రశ్నించే వారిని సమస్యాత్మక వ్యక్తులుగా ముద్ర వేసి, సినిమా అవకాశాలు రాకుండా పక్కన పెడుతున్నారనే చర్చ నడుస్తోంది.
బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘మీటూ’ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తార నుంచి నిన్నమొన్నటి దక్షిణాది నటీమణుల వరకు ఈ వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ నటులపై ధైర్యంగా ఫిర్యాదు చేసిన పలువురు నాయికలకు ఆ తర్వాత పరిశ్రమలో అవకాశాలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే మలయాళ, కన్నడ రంగాల్లోనూ మహిళా హక్కుల కోసం, తోటి నటీమణుల రక్షణ కోసం పోరాడిన ముద్దుగుమ్మలకు సినిమా ఛాన్సులు తగ్గించి తీవ్ర వివక్ష చూపిస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. తమిళ ఇండస్ట్రీలోనూ ప్రముఖులపై ఆరోపణలు చేసిన సింగర్స్, డబ్బింగ్ ఆర్టిస్టులను కూడా పరిశ్రమ వర్గాలు చాలా కాలం దూరం పెట్టాయి.
మన టాలీవుడ్ విషయానికి వస్తే.. కాస్టింగ్ కౌచ్, వేధింపుల గురించి మాట్లాడి తమ కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకున్న వారిలో కొందరు నటీమణుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇండస్ట్రీలోని పలువురు పెద్దలపై తిరుగుబాటు చేసినందుకు ఒక వివాదాస్పద నటిని తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపు పూర్తిగా దూరం పెట్టింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుండి కూడా ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అలాగే మరో సీనియర్ తెలుగు నటి సైతం పరిశ్రమలోని లొసుగులను ప్రశ్నించడం వల్లే తనకు నటిగా మంచి ప్రతిభ ఉన్నా అవకాశాలు ఇవ్వకుండా తొక్కేసారని పలు ఇంటర్వ్యూలలో నిర్మొహమాటంగా స్పష్టం చేసింది. గాడ్ ఫాదర్ లేకపోవడం, అన్యాయాన్ని ఎదిరించడమే వీరు చేసిన తప్పా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో కూడా స్టార్ డైరెక్టర్ల మేకింగ్ శైలిపై కామెంట్స్ చేసిన ఒక టాప్ హీరోయిన్, కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ మొత్తంలో అవకాశాలు కోల్పోయి, ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టాల్సి వచ్చింది. ఇలా తప్పును ప్రశ్నించిన వారిని ఇండస్ట్రీ వెలివేయడం అనేది, ఇతర నటీమణులు నోరు విప్పకుండా భయపెట్టే ఒక వ్యూహాత్మక చర్యగానే విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఇలా అవకాశాలు కోల్పోయిన వారిలో చాలామంది "మాకు ఛాన్సులు ఇవ్వడం లేదు" అని బయటకు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రతిభ ఉన్న నటీమణులను ఇలా కక్షసాధింపు చర్యలతో తొక్కేయడం సరికాదని మద్దతు తెలుపుతున్నారు. అయితే పరిశ్రమలో మహిళల రక్షణ కోసం, సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు, కమిషన్లు ఇలాంటి సమయాల్లో ఎందుకు మౌనంగా ఉంటున్నాయనే విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ ‘సైలెంట్ బ్యాన్’ సంస్కృతికి తెరపడి, ప్రతిభకు మాత్రమే ఇండస్ట్రీ పెద్దలు పట్టం కడతారో లేదో చూడాలి.





