
మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన భక్తిరస విజువల్ వండర్ ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం మరోసారి వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది. గతేడాది జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మెప్పించిన ఈ చిత్రం, సరిగ్గా ఏడాది తర్వాత అంటే ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలో గ్రాండ్ రీ-రిలీజ్ కాబోతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో విష్ణు మంచు ఎంతో పవర్‌ఫుల్ మరియు ఎమోషనల్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఈ అద్భుత పౌరాణిక మరియు చారిత్రాత్మక యాక్షన్ కథా చిత్రాన్ని కలెక్షన్ కింగ్ డాక్టర్ ఎమ్. మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రముఖ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఆయన తన అద్భుతమైన మేకింగ్ శైలితో ఈ భక్తిరస కథను నేటి తరానికి నచ్చేలా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు బలమైన ఎమోషనల్ నరేషన్‌తో వెండితెరపై ఆవిష్కరించారు. భక్త కన్నప్పగా విష్ణు మంచు చేసిన నటన, ఆయన చూపిన అద్భుత హావభావాలు, ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేశాయి. శివుడిపై ఉన్న నిష్కల్మషమైన అమూల్యమైన భక్తిని, ఒక వీరుడి అద్భుత ప్రయాణాన్ని ఇందులో ఎంతో హృద్యంగా చూపించారు.
ఈ సినిమాలో కేవలం విష్ణు మంచు మాత్రమే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటులు భాగం కావడం విశేషం. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి అగ్ర నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో మెరిశారు.
ఇప్పుడు మళ్లీ జూన్ 27న ఈ చిత్రాన్ని వెండితెరపై వీక్షించే అవకాశం ప్రేక్షకులకు లభిస్తోంది. సినిమా ప్రేమికులు, ముఖ్యంగా శివ భక్తులు ఈ వీకెండ్‌లో కన్నప్ప చిత్రాన్ని థియేటర్లలో చూసి మళ్లీ ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు. మరి రీ-రిలీజ్ లో కన్నప్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హంగామా సృష్టిస్తుందో చూడాలి.






