
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ అలనాటి బాలీవుడ్ అందాల తార మమతా కులకుర్ణీ బ్యాంక్ ఖాతాలను మహారాష్ట్ర పోలీసులు స్తంభింపచేశారు. గుజరాత్, ముంబై ఇతర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో మమతకు ఉన్న 8 ఖాతాలను నిలిపివేసినట్లు థానే పోలీసులు ప్రకటించారు. ముంబైలో బయటపడిన అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో మమతా, ఆమెతో పాటు సహజీవనం చేస్తోన్న విక్కీ గోస్వామి సహా మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేయగా, మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆమె బ్యాంకు ఖాతాల నుంచి ఎలాంటి లావాదేవీలు జరక్కుండా ఈ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా మమత ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.






