Home

»

Latest News

'మహేంద్రగిరి వారాహి' టీజర్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సుమంత్ మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్!

Jun 9, 2026 10:36AM

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్న టాలెంటెడ్ హీరో సుమంత్ (Sumanth) సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi). సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అఫీషియల్ టీజర్ తాజాగా విడుదలైంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులలో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ టీజర్ ప్రారంభం నుంచే ప్రేక్షకులను ఒక మిస్టరీ లోకంలోకి తీసుకెళ్తుంది. వారాహి అమ్మవారి శక్తి, మహేంద్రగిరి అనే గ్రామం చుట్టూ అల్లుకున్న ఒక పురాతన రహస్యం, ఆ ఊరిని పట్టి పీడిస్తున్న ఒక అజ్ఞాత శక్తి.. వీటన్నింటి చుట్టూ కథ తిరుగుతుందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. 

మహేంద్రగిరి అనే గ్రామంలో వారాహి అమ్మవారు వెలుస్తుంది. అయితే అక్కడుంటే భూపతి మహారాజ్, ప్రజలను చిత్రహింసలు పెడుతుంటాడు. ఆ ఊరి ప్రజలు అమ్మవారిగా భావించే ఆడపడుచు ముత్యాలమ్మను కేసుల నాశనం చేస్తాడు. దీంతో ఆగ్రహించిన వారాహి అమ్మవారు..  ఆ భూపతి వంశానికి ఒక భయంకరమైన శాపాన్ని విధిస్తుంది. ఆ శాపం ప్రకారం, ఆ భూపతి వంశంలో పుట్టే ప్రతి మగబిడ్డ 33 ఏళ్లు నిండగానే మరణిస్తారు.

కాలక్రమేణా ఆ వంశానికి చెందిన వారంతా ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి చావు వెనుక ఒకే ఒక్క క్లూ కనిపిస్తుంది. అసలు ఆ క్లూ ఏంటి? ఈ మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగిన హీరో సుమంత్ పాత్ర ఏంటి? ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన నిజాలేంటి? అనే ఆసక్తిని కలిగిస్తూ టీజర్ ను కట్ చేశారు.

హీరో సుమంత్ ఈ చిత్రంలో ఎంతో ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చెప్పే సంభాషణలు, హావభావాలు కథలోని సీరియస్‌నెస్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. "మీరు మీ కోట నుంచి నన్ను పంపించేయొచ్చు.. మీ జనాల్ని ఊరి నుంచి పంపించేయొచ్చు.. కానీ నేను మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి వస్తాను" అంటూ సుమంత్ చెప్పే డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో మాళవిక నాయర్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి పాత్రలు కథను మలుపు తిప్పే విధంగా ఉంటాయని సమాచారం. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మైథాలజీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సరిగ్గా బ్లెండ్ చేసి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. టీజర్ చివర్లో వచ్చే వారాహి అమ్మవారి ఉగ్రరూపం థియేటర్లలో ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com