తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడిగా, రచయితగా సుపరిచితమైన సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో నవ్వించిన ఆయన.. తాజాగా ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తన సినీ ప్రయాణం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. సినిమాలను తాను వదిలిపెట్టలేదని, తన స్థాయికి తగ్గ మంచి పాత్రలు రావడం లేదనే కారణంతోనే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు.
సినిమాల్లోకి రాకముందు సుమారు 10 నుంచి 15 ఏళ్ల పాటు నాటకరంగంలో నటించానని ఎల్బీ శ్రీరామ్ చెప్పారు. ఆ అనుభవంతోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 500 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించే అవకాశం దక్కిందన్నారు. నటుడిగానే కాకుండా రచయితగా కూడా తనదైన ముద్ర వేసుకున్న ఆయన.. ‘హలో బ్రదర్’, ‘హిట్లర్’ వంటి దాదాపు 40 విజయవంతమైన చిత్రాలకు సంభాషణలు రాశారు. అయితే కాలక్రమంలో తనతో కలిసి ప్రయాణించిన పలువురు సమకాలీన నటులు, కమెడియన్లు దూరమయ్యారని, తన గురువు ఈవీవీ సత్యనారాయణ కూడా లేకపోవడంతో పరిస్థితులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నచ్చే, బలమైన పాత్రలు పెద్దగా రాకపోవడంతో యూట్యూబ్ కోసం సొంతంగా షార్ట్‌ఫిలిమ్స్ చేయడం ప్రారంభించానని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ‘గరివిడి లక్ష్మి’ సినిమా తనను కథతోనే ఆకట్టుకుందని ఎల్బీ శ్రీరామ్ చెప్పారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ద్వారా ఈ బయోపిక్ గురించి తెలుసుకున్నానని, దర్శకుడు గౌరీ నాయుడు కథను వివరించిన విధానం, జానపద కళపై ఆయనకున్న అవగాహన తనకు నచ్చాయని తెలిపారు. ఇందులో గరివిడి లక్ష్మికి గురువుగా కనిపించనున్నానని, తన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించానని చెప్పారు.
మరోవైపు ‘గరివిడి లక్ష్మి’లో మొత్తం 16 పాటలు ఉన్నాయని, ఇది మంచి సంగీత విందుగా నిలుస్తుందని ఎల్బీ శ్రీరామ్ అన్నారు. చిన్నతనంలో దసరా పందిళ్లలో బుర్రకథలు వింటూ పెరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బుర్రకథ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కళారూపమని పేర్కొన్నారు. ఒక మహిళా జానపద కళాకారిణి జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న నిర్మాతల నిర్ణయాన్ని అభినందించిన ఆయన.. ‘శంకరాభరణం’, ‘మహానటి’ తరహాలో ‘గరివిడి లక్ష్మి’ కూడా మంచి విజయాన్ని సాధించి తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[LB Sriram, LB Sriram Emotional Speech, LB Sriram Movies, Garividi Lakshmi, Garividi Lakshmi Movie, Garividi Lakshmi Trailer, Anandhi, Gowri Naidu Jammu, People Media Factory, Telugu Cinema News, Tollywood News]






