బన్నీ, క్రిష్లకు మెగా బ్రదర్ కౌంటర్!
on Dec 31, 2016
ఈ సంక్రాంతి వార్ అప్పుడే మొదలైపోయింది. ఖైదీ నెం.150, గౌతమి పుత్ర బాక్సాఫీసు దగ్గర తలపడకముందే మాటల యుద్ధానికి శ్రీకారం జరిగిపోయింది. గౌతమిపుత్ర ఆడియో వేడుక సాక్షిగా ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు క్రిష్. చిరు వర్గం ఏమాత్రం తగ్గలేదు. విశాఖపట్నంలోని మెగా అభిమానుల ముందు ` ఈ సంక్రాంతి మనదే..` అంటూ పరోక్షంగా గౌతమి పుత్రకు హెచ్చరికలు పంపాడు బన్నీ. దాంతో.. ఈసారి యుద్ధం వాడీ వేడీగా జరగబోతోందని అర్థమైపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే... రేపు సినిమా విడుదలైనప్పుడు ఎలా ఉండబోతోందో అన్నది అందరిలోనూ ఒకటే టెన్షన్. అయితే... ఈ పరిస్థితినీ, ఉదృతినీ తగ్గించడానికి మెగా బ్రదర్ నాగబాబు తన వంతు ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్లు చేసిన క్రిష్, బన్నీలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. సినిమా వాళ్లమై ఉండి.. మన సినిమానే గొప్ప, మన సినిమానే ఆడాలన్న ధోరణి పనికి రాదు, అన్ని సినిమాలూ ఆడాలి, అందరూ బాగుండాలనికోరుకొందాం, ఇలాంటి రెచ్చగొట్టే ధోరణులు వద్దు.. అంటూ హితవు పలికాడు. అభిమానులు కాస్త శాంతంగా ఉండాలని, రెండు సినిమాలూ హిట్టవ్వాలని కోరుకోవాలని సలహా ఇచ్చాడు. చిరు సినిమా బాగా ఆడడం ఎంత ముఖ్యమో.. బాలయ్య సినిమా హిట్టవ్వడం కూడా అంతే ముఖ్యమని, ఎందుకంటే ఆ సినిమాని క్రిష్ చాలా కష్టపడి చేశాడని, అన్ని సినిమాలు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని క్లాస్ పీకాడు నాగబాబు. ఇది కచ్చితంగా క్రిష్, బన్నీలను ఉద్దేశించే అన్నది స్పష్టంగా అర్థమైపోతోంది. ఇకపైనా అటు నందమూరి, ఇటు మెగా కాంపౌండ్ వర్గాలు సైలెంట్ అవుతాయో.. లేదంటే ఇలా మాటల యుద్ధాలకు మరింత పదును పెడతారో చూడాలి.