సినిమా కోసం దమ్ము కొట్టడం నేర్చుకున్నా
on Mar 20, 2020
'సీత ఆన్ ది రోడ్' ట్రైలర్ చూశారా? చాలామంది చూసే ఉంటారు. విడుదలైన తర్వాత వివాదాలకు చోటు ఇచ్చింది. అందులో డైలాగులపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సంభాషణలు ఉన్న చిత్రానికి 'సీత ఆన్ ది రోడ్' టైటిల్ పెట్టడం ఏంటని విమర్శించారు. సినిమా ఇంకా విడుదల కాలేదనుకోండి. ఇందులో ప్రధాన పాత్రలలో ఒక పాత్ర పోషించిన కల్పికా గణేష్ ట్రైలర్లో 'నేను సిగరెట్ తాగుతాను. మందు కొడతాను. ఇప్పుడు బ్రేకప్‌లో ఉన్నాను. అలాగని చెప్పి నీతో ఈజీగా పడుకుంటానని ఎక్స్పెక్ట్ చేయకు' అని ఒక డైలాగ్ చెప్పారు. చెప్పడమే కాదు... ఈ సినిమా కోసం దమ్ము కొట్టడం నేర్చుకున్నానని ఆమె తెలిపారు.
"గతేడాది దర్శకుడు ప్రణీత్ కథ చెప్పినప్పుడు... ఎన్నాళ్ల నుండో నేను ఎదురు చూస్తున్న రోల్ ఇదేనని అనిపించింది. సినిమాలో నాది కొరియోగ్రాఫర్ రోల్. ఈ సినిమా కోసం నేను దమ్ము కొట్టడం, బుల్లెట్ డ్రైవ్ చేయడం నేర్చుకున్నా. నేను సిగరెట్ కాల్చడాన్ని సమర్ధించను. కానీ, క్యారెక్టర్ మీద ప్రేమతో దమ్ము కొట్టే షాట్ కూడా చేశా" అని కల్పికా గణేష్ చెప్పారు. తాను నటించిన గత సినిమాల్లో పాత్రలకు, ఈ పాత్రకు చాలా వ్యతాసం ఉంటుందని ఆమె తెలిపారు. 'సీత ఆన్ ది రోడ్'లో తన క్యారెక్టర్ తన ఇమేజ్ మారుస్తుందని ఆమె అన్నారు. ఐదుగురు అమ్మాయిలూ స్వేచ్ఛ కోసం ఎటువంటి ప్రయాణం చేశారనేది సినిమా ఈ సినిమా కథ.