'జులాయి'గా బన్నీ అలరించి నేటికి పదేళ్లు
on Aug 9, 2022
టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా వీరి కాంబోలో మూడు సినిమాలు రాగా మూడూ విజయాలను అందుకున్నాయి. ఈ హ్యాట్రిక్ కాంబోకి పదేళ్ల క్రితం ఆగస్టు 9, 2012న విడుదలైన 'జులాయి' సినిమాతోనే పునాది పడింది.
'జులాయి'కి ముందు 'వరుడు', 'వేదం', 'బద్రినాథ్' వంటి వరుస ప్లాప్ లను ఎదుర్కొన్నాడు బన్నీ. త్రివిక్రమ్ సైతం 'ఖలేజా' రూపంలో కమర్షియల్ ఫెయిల్యూర్ ని అందుకున్నాడు. అయినప్పటికీ 'జులాయి'పై విడుదలకు ముందు మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు మించి ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ లో.. బాగా తెలివైన హీరో, విలన్ ల మధ్య మైండ్ గేమ్ ఆకట్టుకుంది. ఇందులో బన్నీ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డైలాగ్స్, సాంగ్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని చక్కగా కుదరడంతో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సోనూసూద్, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, రావు రమేష్, బ్రహ్మాజీ, షఫీ, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరం సుబ్రహ్మణ్యం తదితరులు నటించారు.
బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ 'జులాయి' విడుదలై నేటితో పదేళ్లు పూర్తయింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' చిత్రాలు కూడా విజయాలను అందుకున్నాయి.
Also Read