హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్‌లో జాక్ స్పారో పాత్రతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అయితే గత కొంతకాలంగా వ్యక్తిగత వివాదాలు, ఇతర కారణాలతో ఆయన సినిమాల సంఖ్య తగ్గింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జానీ డెప్ నటించిన ‘డే డ్రింకర్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
మార్క్ వెబ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జానీ డెప్‌తో పాటు పెనెలోప్ క్రజ్, మాడెలిన్ క్లైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైవేట్ యాచ్‌లో బార్‌టెండర్‌గా పనిచేసే యువతి చుట్టూ ఈ కథ మొదలవుతుంది. ఆమెకు అదే యాచ్‌లో ఉండే ఓ మిస్టీరియస్ వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి పాత్రలోనే జానీ డెప్ కనిపిస్తున్నారు. అతడితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమె జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది.
ట్రైలర్‌ను బట్టి చూస్తే జానీ డెప్ పాత్ర చాలా రహస్యంగా ఉంటుంది. అతడి గతం ఏమిటి? యాచ్‌లోకి ఎందుకు వచ్చాడు? అతడికి, పెనెలోప్ క్రజ్ పోషించిన క్రిమినల్ పాత్రకు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ను రూపొందించారు. తన కథ ప్రతీకారానికి సంబంధించినదా.. లేక అంతకంటే ప్రమాదకరమైనదా అనే తరహాలో జానీ డెప్ చెప్పే మాటలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో జానీ డెప్ లుక్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. గతంలో చూసిన పాత్రలకు భిన్నంగా కాస్త వయసు మళ్లిన లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు. మరోవైపు పెనెలోప్ క్రజ్‌తో జానీ డెప్‌కు ఇది నాలుగో సినిమా కావడం విశేషం. గతంలో వీరిద్దరూ ‘బ్లో’, ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్: ఆన్ స్ట్రేంజర్ టైడ్స్’, ‘మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’ చిత్రాల్లో కలిసి నటించారు.
‘డే డ్రింకర్’ను దర్శకుడు మార్క్ వెబ్ తెరకెక్కిస్తున్నారు. జాక్ డీన్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
లయన్స్‌గేట్ సంస్థ నిర్మిస్తున్న ‘డే డ్రింకర్’ 2027 మార్చి 26న అమెరికాలో థియేటర్లలో విడుదల కానుంది. జానీ డెప్, పెనెలోప్ క్రజ్ కాంబినేషన్‌తో పాటు మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రూపొందుతుండటంతో హాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ దీనిపై ఆసక్తి నెలకొంది.
[Johnny Depp, Day Drinker, Day Drinker Trailer, Johnny Depp Day Drinker, Day Drinker Movie, Johnny Depp New Movie, Penelope Cruz, Madelyn Cline, Marc Webb, Day Drinker 2027, Hollywood Movies, Johnny Depp Latest Movie, Day Drinker Release Date]






