Home

»

Latest News

అనుమాన పక్షి మూవీ రివ్యూ

Sep 25, 2026 3:09PM

నటీనటులు: రాగ్ మయూర్, అజయ్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, రాశి, బ్రహ్మాజీ

సాంకేతిక వర్గం:

రచన: విమల్ కృష్ణ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు, సునీల్ కుమార్ నామ
ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్
దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాతలు: మేఘా చిలక, రాజీవ్ చిలక, హీరాచంద్ దండ్, విహాన్ దండ్, రాజేష్ కె. జగ్తియాని, స్నేహ రాజేష్ జగ్తియాని, శ్రీచరణ్ మార్నేని

విమల్ కృష్ణ తన తొలి చిత్రం డీజే టిల్లు (DJ Tillu) తో విజయవంతమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన ఆ ఫ్రాంచైజీకి వెళ్లకుండా, తన తదుపరి చిత్రమైన అనుమాన పక్షి (Anumana Pakshi) చేయడానికి తగినంత సమయం తీసుకున్నారు. రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో వివరంగా సమీక్షిద్దాం.

కథ:


సన్నీ (Rag Mayur) అనుమాన పక్షి అనే అకౌంట్ నడిపే ఒక కంటెంట్ క్రియేటర్. అతిగా ఆలోచించడం, అర్థం లేని భయాల తో బ్రతకడం  వల్ల అతను నిత్యం ట్రోల్ అవుతుంటాడు. అతనికి వర్మ (Prince Cecil) అనే ఒక స్నేహితుడు అలాగే  శత్రువు ఉంటాడు. సన్నీ అనుమానం కారణంగా వర్మ తన ప్రేయసి రమ్యతో బ్రేకప్ చెప్పుకోవాల్సి వస్తుంది. దాంతో రమ్యను తిరిగి తన జీవితంలోకి తీసుకురావాలని వర్మ.. పక్షిని పదే పదే అడుగుతుంటాడు. మరోవైపు, సన్నీ వల్ల స్పా వ్యాపారం దెబ్బతిన్న మరో స్నేహితుడు, తనను కాపాడటానికి కాశ్మీర్ (Kashmir) రావాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తాడు.

సన్నీ వర్మతో కలిసి కాశ్మీర్ వెళ్తాడు. అక్కడ అతనికి కన్య (Merin Philip) పరిచయమవుతుంది. ఆమె అతనికి ఒక చాక్లెట్ ఇస్తుంది, అది తిన్నాక అతను ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. దీన్ని అవకాశంగా తీసుకుని, ఆమె సన్నీని తన తండ్రి బ్రహ్మోస్ (Brahmaji) దగ్గరకు తీసుకువెళుతుంది. మరోవైపు వాయిస్ ఆఫ్ వైజాగ్ (Vasu - Voice of Vizag) అనే ఇన్‌స్టా పేజీని నడిపే వైజాగ్ పోలీస్ వాసు (Ajay), తన ఘోస్ట్ హంటర్ భార్య సూజి (Raasi)తో కలిసి కాశ్మీర్ వస్తాడు. ఉన్నట్టుండి, సన్నీకి తన మంచం మీద వర్మ శవమై కనిపిస్తాడు. వర్మను ఎవరు చంపారు? కన్య ఎవరు? ఈ మిస్టరీ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

సన్నివేశాల్లో కాస్తయినా వినోదాన్ని నింపడానికి రాగ్ మయూర్ బాగానే శ్రమించాడు. అతని నటన బాగానే ఉన్నప్పటికీ, స్క్రిప్ట్ మాత్రం చాలా పేలవంగా సాగింది. ప్రిన్స్‌కు డీజే టిల్లు తరహా పాత్రే దక్కగా, రాధిక పాత్రను అనుకరించేలా ఉన్న మెరిన్ ఫిలిప్ పాత్ర ఆ స్థాయి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేయలేకపోయింది.

స్క్రిప్ట్‌లో ప్రేక్షకులను నవ్వించే సత్తా ఎక్కడా కనిపించలేదు. వ్లాగర్ పోలీస్ ఆఫీసర్‌గా అజయ్ , ఘోస్ట్ హంటర్‌గా రాశి పాత్రలకు రాసుకున్న దానికంటే మరింత బలమైన కంటెంట్ అవసరం. సినిమాను నిలబెట్టడానికి వారు ఎంత ప్రయత్నించినా, తెరపై మాత్రం దిక్కుతోచని స్థితిలోనే కనిపించారు. అజయ్ నటనలో ఓవర్ యాక్షన్ ఎక్కువగా కనిపించింది.

కథలోని ప్రతి పరిణామం, ప్రతి సన్నివేశం, ప్రతి వన్-లైనర్ శ్రద్ధ పెట్టి రాసినట్లు కాకుండా, ఏదో తేలికగా తీసుకుని రాసినట్లు అనిపిస్తుంది. డీజే టిల్లు తో చాలా పోలికలు ఉన్నప్పటికీ, అందులో టిల్లు క్యారెక్టర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ,  ఇంతలా భయపడే వ్యక్తి  ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వడం  ఏమాత్రం సహేతుకంగా అనిపించదు.

పెరుగుతున్న సోషల్ మీడియా కంటెంట్ కల్చర్, ఇన్‌ఫ్లుయెన్సర్లు కావాలనే తపనపై సెటైరిక్ పంచ్‌లు వేస్తున్నామని మేకర్స్ భావించినప్పటికీ, ఆ జోకులు చాలా చప్పగా తేలిపోయాయి. సన్నివేశాలు ఎంత పేలవంగా, అస్తవ్యస్తంగా మారతాయంటే, డీజే టిల్లు తీసిన దర్శకుడే ఈ సినిమాను తీశాడా అనే సందేహం కలుగుతుంది.

శ్రీచరణ్ పాకాల (Sri Charan Pakala) సంగీతం, నేపథ్య సంగీతం కూడా ఎలాంటి మెరుపులు మెరిపించలేకపోయాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా చాలా నిరాశపరుస్తాయి. ప్రతి విభాగంలోనూ విఫలమైన ఈ సినిమా, సాగదీసిన ఒక షార్ట్ ఫిల్మ్‌లా అనిపిస్తుంది. మొత్తంగా, విమల్ కృష్ణ నుంచి వచ్చిన అనుమాన పక్షి ఏమాత్రం గుర్తుంచుకోలేని చిత్రం.

పాజిటివ్స్:
రాగ్ మయూర్ చెప్పిన కొన్ని వన్-లైనర్స్

నెగెటివ్స్:
పేలవమైన రచన
నవ్వు రాని వన్-లైనర్స్
గందరగోళ కథనం
గుర్తుంచుకోలేని సాంకేతిక విలువలు
నాసిరకం ప్రొడక్షన్ డిజైన్

బాటమ్‌లైన్: అనుమానం పెను భూతం కనుక ఈ పక్షి ఎగరడం పూర్తి గా మర్చిపోయింది! 

 

రేటింగ్: 1.5/5

 

విజ్ఞప్తి : ఈ సమీక్షలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగతమైనవి. వీటికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. వీటిపై స్పందించే ముందు పాఠకులు తమ విచక్షణను ఉపయోగించగలరు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com