Home

»

Latest News

తండ్రి బాటలోనే విజయ్ తనయుడు.. హీరోగా గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం?

Oct 9, 2026 6:36PM

తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ఇప్పుడు హీరోగా వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? కోలీవుడ్‌లో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు తండ్రిలా నటుడిగా కాకుండా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించిన జేసన్.. ‘సిగ్మా’ సినిమాతో మెగాఫోన్ పట్టారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో, ఇప్పుడు జేసన్ తన కెరీర్‌ను మరో దిశలో తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

‘సిగ్మా’ నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థే ఇప్పుడు జేసన్‌ను హీరోగా పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం పలువురు దర్శకుల కథలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు లింగుసామితో పాటు, నటుడు విక్రాంత్ సోదరుడు సంజీవ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. 

నిజానికి జేసన్ సంజయ్‌కు సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ, తొలుత దర్శకత్వం వైపే అడుగులు వేశారు. విదేశాల్లో ఫిల్మ్‌మేకింగ్‌కు సంబంధించిన చదువులు పూర్తి చేసిన ఆయన.. కథలు రాయడం, దర్శకత్వం వహించడం తనకు ఇష్టమని గతంలో వెల్లడించారు. ‘సిగ్మా’ విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటనపై కూడా ఆసక్తి ఉందని, సినిమా విడుదల తర్వాత ఆ దిశగా ఆలోచిస్తానని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తారనే వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. 

ఇక విజయ్‌కు ఉన్న భారీ అభిమానగణం నేపథ్యంలో జేసన్ హీరోగా పరిచయమైతే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంది. అయితే దర్శకుడిగా తొలి ప్రయత్నంలో మిశ్రమ స్పందన అందుకున్న ఆయన.. నటుడిగా ఎలాంటి కథను ఎంచుకుంటారు? తండ్రి వారసత్వాన్ని ఉపయోగించుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఇవన్నీ ప్రచారంలో ఉన్న వార్తలే కావడంతో, జేసన్ తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 

 

[Jason Sanjay Acting Debut, Thalapathy Vijay Son Jason Sanjay, Jason Sanjay Sigma Movie, Jason Sanjay Upcoming Movie, Lyca Productions Jason Sanjay, Jason Sanjay Hero Debut, Sigma Movie Mixed Reviews]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com