Home

»

Latest News

వర్మను మిస్ అవుతున్న ర‌జినీకాంత్‌.. మ‌రి ‘జైల‌ర్‌2’లో కొత్త మ్యాజిక్ ఏంటి.?

Oct 6, 2026 8:39PM

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జైలర్’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. భారీ స్టార్ క్యాస్టింగ్, యాక్షన్, డార్క్ కామెడీతో ట్రైలర్ ఆకట్టుకుంటున్నప్పటికీ.. నెటిజన్లలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదేంటంటే.. తొలి భాగంలో మెప్పించిన వర్మ పాత్ర ఈసారి లేకపోవడం.

‘జైలర్’ సినిమాకు రజనీకాంత్ మాస్ ఇమేజ్ ఎంత ప్లస్ అయ్యిందో.. విలన్‌గా వినాయకన్ పోషించిన వర్మ పాత్ర కూడా అంతే కీలకంగా నిలిచింది. వర్మలోని క్రూరత్వం, విచిత్రమైన నవ్వు, డార్క్ హ్యూమర్, సిట్యుయేషనల్ కామెడీ, ప్రత్యేకమైన మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్, వర్మతో పాటు అతని గ్యాంగ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందుకే ‘జైలర్ 2’ ట్రైలర్‌లో ఆ తరహా పాత్ర కనిపించకపోవడం కొంతమంది అభిమానులకు లోటుగా అనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ లోటును పూడ్చేందుకు దర్శకుడు నెల్సన్ కొత్త పాత్రను చాలా ఆసక్తికరంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడ్ ఈ సినిమాలో ‘దిలీప్’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాత్ర పరిచయ వీడియోలో సిగార్‌తో ఆయన కనిపించిన తీరు, స్టైలిష్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ట్రైలర్‌లోనూ ఆయన పాత్రకు ప్రాధాన్యం కనిపిస్తోంది. అయితే వర్మ తరహా డార్క్ హ్యూమర్, కామిక్ టైమింగ్, విలనిజాన్ని సూరజ్ ఏ స్థాయిలో పండించగలడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ‘జైలర్ 2’లో హృతిక్ రోష‌న్‌, ఎస్.జె.సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి వంటి కొత్త ముఖాలతో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ కూడా కనిపించనున్నారు. ట్రైలర్ చూస్తే తొలి భాగం కంటే కథ పరిధి, యాక్షన్, పాత్రల సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో వర్మ సృష్టించిన బెంచ్‌మార్క్‌ను సూరజ్ పాత్ర అందుకోగలదా? నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, విలనిజం మరోసారి అదే స్థాయిలో వర్కౌట్ అవుతాయా? అనేది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది.

 

 

[Jailer 2, Rajinikanth, Suraj Venjaramoodu, Vinayakan, Varman, Dileep Character, Nelson Dilipkumar, Jailer 2 Trailer, Tamil Cinema, Jailer 2 Release Date]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com