
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ 'ఇసకపట్నం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్, ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, సునీల్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ పై విడుదలకు ముందుకు మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మొత్తం 7 ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందంటే? (Isakapatnam Web Series Review)
కథ:
సముద్ర తీర ప్రాంతమైన ఇసకపట్నంలో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న నాయకుడు చిన్నారావు (రాజీవ్ కనకాల). అక్కడి ప్రజల కష్టసుఖాలను అర్థం చేసుకుంటూ అందరికీ దేవుడిగా మారుతాడు. కొన్నేళ్ల తర్వాత ఎక్కడి నుంచో వలస వచ్చిన నాయుడు (సముద్రఖని) అనే వ్యక్తి.. చిన్నారావు వద్ద నమ్మకంగా చేరి, అనతికాలంలోనే అతనికి కుడిభుజంగా ఎదుగుతాడు. కానీ, మనసులో క్రూరత్వాన్ని దాచుకున్న నాయుడు, సరైన సమయం చూసి గంగమ్మ జాతరలో చిన్నారావును మట్టుబెడతాడు. ఆ తర్వాత ఇసకపట్నానికి తానే మకుటం లేని మహారాజుగా మారి, ఒక అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు.
కొన్నేళ్ల తర్వాత నాయుడు కూతురు భారతి (ఐశ్వర్య రాజేష్).. తన తండ్రి చేసే అరాచకాలు, అక్రమాలు భరించలేక తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుంది. ప్రజల శ్రేయస్సు కోరే భారతి, తన స్వంత తండ్రికే ఓ పెద్ద రాజకీయ సవాలు విసురుతుంది. ఈ నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల మధ్య వార్ ఎలా నడిచింది?. హిరణ్య కశ్యపుడు- ప్రహ్లాదుడి తరహాలో సాగే ఈ ఎమోషనల్ డ్రామాలో, తండ్రి నిర్మించిన రాక్షస సామ్రాజ్యాన్ని కూతురు ఏ విధంగా కూకటి వేళ్లతో పెకిలించి వేసిందనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ఇది 'ఇసకపట్నం' అనే ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ అయినప్పటికీ, చూసే ప్రేక్షకులకు విశాఖపట్నమే గుర్తుకొస్తుంది. విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్, పోర్టు ఏరియా స్మగ్లింగ్, ఆధిపత్య పోరు అనేవి తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. గతంలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమా, ‘పరంపర’ వెబ్ సిరీస్ వంటి ఛాయలు ఇందులో కనిపిస్తాయి.
అయితే ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే, ఒక పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్‌లో ఐశ్వర్య రాజేష్ నిలబడటం. ప్రశాంత్ రగతి అందించిన ఈ కథలో ఆధిపత్య పోరు, కపట నాటకాలు, ప్రేమ అన్నీ చక్కగా కుదిరాయి. మొదటి ఎపిసోడ్‌లో రాజీవ్ కనకాలను చంపే సీన్ చాలా పవర్‌ఫుల్‌గా తెరకెక్కించారు.
ఎడిటర్ నుంచి దర్శకుడిగా మారిన గ్యారీ బీహెచ్, ఈ వెబ్ సిరీస్‌ను ఒక సినిమా స్థాయి పొలిటికల్ సీట్-ఎడ్జ్ థ్రిల్లర్‌గా మలిచారు. మొదటి ఎపిసోడ్‌లోనే నాయుడు పాత్ర ఎలా ఎదిగిందో చూపించి ఆసక్తి రేకెత్తించారు. మొత్తం 7 ఎపిసోడ్‌లుగా సాగే ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ చివర్లో ఇచ్చే ట్విస్టులు ప్రేక్షకులను తదుపరి ఎపిసోడ్ చూసేలా కట్టిపడేస్తాయి. అక్కడక్కడా కొద్దిగా ల్యాగ్ అనిపించినా, వెబ్ సిరీస్ ఫార్మాట్ కావడం వల్ల అది పెద్ద మైనస్ కాలేదు.
మొదటి 3 ఎపిసోడ్‌లు పాత్రల పరిచయం, వరుస హత్యలతో కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, 4వ ఎపిసోడ్ నుండి కథ ఊపందుకుంటుంది. ఒక్కో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతున్న కొద్దీ కథపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే ట్విస్ట్‌లు, మైండ్ గేమ్స్ సిరీస్‌ను ఆసక్తికరంగా మార్చాయి. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్‌లో గంగమ్మ తల్లి జాతర నేపథ్యంలో ఐశ్వర్య రాజేష్‌ను చూపించిన విధానం, నటీనటుల ప్రతిభ ఈ సిరీస్‌ను నిలబెట్టాయి.
వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ 1980ల కాలం నాటి పోర్ట్ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా విజువల్స్ అందించగా, ప్రవీణ్ లక్కరాజు సంగీతం సీన్లను బాగా ఎలివేట్ చేసింది.
ఈ సిరీస్‌లో సముద్రఖని తన కళ్లలోనే క్రూరత్వాన్ని చూపిస్తూ 'నాయుడు' అనే నెగెటివ్ పాత్రలో జీవించేశారు. తండ్రిని ఎదిరించే 'భారతి' పాత్రలో మరోసారి అద్భుత నటన కనబరిచారు ఐశ్వర్య రాజేష్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నారు. కొద్దిసేపే కనిపించినా రాజీవ్ కనకాల తన మార్క్ చూపించగా.. పోలీస్ ఆఫీసర్‌గా సునీల్, ఐశ్వర్య ప్రేమికుడిగా సుధాకర్ కోమాకుల, ఆటో డ్రైవర్‌గా నరేష్ అగస్త్య తమ పాత్రలకు న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్:
సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల పోటాపోటీ నటన
ప్రతి ఎపిసోడ్ ఎండ్‌లో వచ్చే ఆసక్తికర ట్విస్టులు
1980ల నాటి నేటివిటీ, విజువల్స్
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా నెమ్మదించిన కథనం
పాత సినిమాలను గుర్తుకు తెచ్చే రొటీన్ పాయింట్
ఫైనల్ గా..
రొటీన్ రివేంజ్ డ్రామాయే అయినప్పటికీ.. తండ్రీకూతుళ్ల మధ్య సాగే ఉత్కంఠభరిత పొలిటికల్ మైండ్ గేమ్‌ల కోసం, నటీనటుల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం 'ఇసకపట్నం' సిరీస్‌ను ఓసారి తప్పకుండా చూడొచ్చు.
రేటింగ్: 2.75/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.






