Home

»

Latest News

72 పాటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన భారతీయ సినిమా

Aug 11, 2026 5:19PM


పాట.. అమ్మ లాలి పాట నుంచి ఎన్నో మధురమైన బాణీలతో కూడిన పాట మనల్ని కొత్త లోకంలోకి విహరించేలా చేస్తుంది. ఆయుష్షు ని పెంచే శక్తి కూడా పాటకి ఉందని సంగీత ప్రియులు చెప్తుంటారు. కథని ముందుకు నడిపే ఒక శక్తివంతమైన సాధనం కూడా. ఇక   రిలీజ్ కి ముందు ప్రతి ప్రేక్షకుడి ఇంట్లో ఒక సినిమా గురించి డిస్కర్షన్ జరుగుతూ ఉండాలంటే ముందు పాట తిష్ట వేయాలని అంటారు. అంతటి శక్తివంతమైన సాధనం పాట. 

 సాధారణంగా ఒక సినిమాలో నాలుగైదు పాటలు ఉండటం చూస్తుంటాం. భారీ మ్యూజికల్ హిట్లుగా నిలిచిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ (14 పాటలు), ‘రాక్‌స్టార్’ (14 పాటలు), ‘తాళ్’ (12 పాటలు) వంటి చిత్రాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. కానీ, ఒకే ఒక భారతీయ సినిమాలో ఏకంగా 72 పాటలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? అవును, ఇది ముమ్మాటికీ నిజం! ఈ అద్భుతమైన ఘనతతో ఆ సినిమా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఈ రికార్డును ఏ ఒక్క భారతీయ లేదా అంతర్జాతీయ చిత్రం కూడా చెరిపివేయలేకపోయింది.  ఆ చారిత్రాత్మక సినిమా పేరే ‘ఇంద్రసభ’ (Indrasabha). భారతీయ టాకీ సినిమాల తొలి రోజుల్లో, అంటే 1932 లో ఈ చిత్రం విడుదలయ్యింది. భారతదేశపు మొట్టమొదటి మాట్లాడే చిత్రం 'ఆలం ఆరా' (1931) విడుదలైన ఒకే ఒక్క సంవత్సరం తర్వాత మదన్ థియేటర్స్ పతాకంపై జె.జె. మదన్ నిర్మాణం, నిర్వహణలో ఈ మ్యూజికల్ వండర్ తెరకెక్కింది. ప్రఖ్యాత ఉర్దూ రచయిత ఆగా హసన్ అమానత్ రాసిన 19వ శతాబ్దపు నాటకం ఆధారంగా 3 గంటల 31 నిమిషాల నిడివితో ఈ విజువల్ గ్రాండియర్ రూపొందింది. విశేషమేమిటంటే, ఈ సినిమాలో ప్రతి ముఖ్య పాత్రకూ ఒక ప్రవేశ పాట (ఎంట్రీ సాంగ్) ఉండటంతో పాటు, ఎక్కువ భాగం సంభాషణలు కూడా కావ్య రూపంలో, సంగీత బద్ధంగానే సాగుతాయి.  పాటల వైవిధ్యంలో కూడా ఈ చిత్రం ఒక సంచలనం. 


Also read: సంచలన వార్త: సీక్వెల్ కావాలంటున్న స్టార్ #హీరో.. వద్దంటున్న టాప్ డైరెక్టర్!

ఇందులో మొత్తం 72 పాటలు ఉండగా, వాటి వర్గీకరణ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!  31 గజల్స్,15 సాధారణ గీతాలు, 9 ఠుమ్రీలు, 5 ఛంద్‌లు, 4 హోళీ పాటలు, 2 చౌబోలాలు మరియు 6 ఇతర వైవిధ్యమైన సంగీత స్వరాలు ఉన్నాయి. ప్రముఖ గాయని, నటి జహానారా కజ్జన్ (‘బెంగాల్ నైటింగేల్’) మరియు మాస్టర్ నిసార్లు ప్రధాన పాత్రల్లో నటించి తమ గాత్రంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఒక దయగల రాజుపై స్వర్గలోక అప్సరస మనసు పడటం అనే మైథలాజికల్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం నాటి ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందించింది. సాంకేతికత ఏమాత్రం లేని 1930ల కాలంలోనే ఇన్ని పాటలతో సినిమా తీయడం ఒక అద్భుతం అని చెప్పాలి. గడిచిన 90 ఏళ్లకు పైగా చరిత్రలో ఈ 72 పాటల ప్రపంచ రికార్డు చెక్కుచెదరకుండా ఉండటం భారతీయ సినిమా సంగీత వైభవానికి నిలువెత్తు నిదర్శనం.

Indrasabha, song, Tollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com