Home

»

Latest News

Hushar Pittalu Review: 'హుషార్ పిట్టలు' మూవీ రివ్యూ

Aug 14, 2026 6:12PM

అన్ష్ త్రోరాట్, వాసవి గణేషన్ జంటగా బిక్షు యాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా 'హుషార్ పిట్టలు'. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ ఫిల్మ్స్ లాంటి ప్రముఖ సంస్థలు రిలీజ్ చేస్తుండటం, ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో.. ఈ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆగష్టు 15 విడుదల తేదీ కాగా, అవుట్ పుట్ మీద నమ్మకంతో ఇప్పటికే ప్రీమియర్స్ వేశారు. ప్రమోషనల్ కంటెంట్ చూసి ఇదొక అడల్ట్ కామెడీ ఫిల్మ్ అనే అభిప్రాయంలో చాలామంది ఉన్నారు. మరి ఇది నిజంగానే అడల్ట్ కంటెంట్ తో వచ్చిందా? లేక అందరినీ ఆలోచనలో పడేసే కంటెంట్ తో వచ్చిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
తెలంగాణలోని ఒక పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ సాగుతుంది. టెన్త్ క్లాస్‌లో స్కూల్ ఫస్ట్ వచ్చిన రవి (అన్ష్) ఎంతో తెలివైన కుర్రాడు. అదే ఊరిలో ఉండే చిట్టి (వాసవి గణేషన్) అనే అమ్మాయి పెద్దమనిషి అయ్యాక.. రవిని చూసి ఇష్టపడుతుంది.  అయితే, బాధ్యతగా చదువుకునే రవికి, ఊరిలోని ఫ్రెండ్స్ ఫోన్లలో అడల్ట్ వీడియోలు చూపిస్తూ అమ్మాయిల ప్రేమలో పడాలంటూ చెడు మార్గాలు నూరిపోస్తారు. దాంతో రవి కూడా చిట్టి వైపు ఆకర్షితుడవుతాడు. తెలిసి తెలియని వయసులో, హార్మోన్ల ప్రభావంతో వీరు హద్దులు దాటి ఇంట్లో వాళ్లకు తెలియకుండా శృంగారంలో మునిగిపోతారు. అదే నిజమైన ప్రేమ అనుకుంటారు. అయితే, పిల్లలను ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? ఈ అనాలోచిత చర్యలు ఆ రెండు కుటుంబాల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనేదే చిత్ర అసలు సారాంశం.

విశ్లేషణ:
ఆకర్షణలో పడి పరిపక్వత లేని వయసులో వేసే ఒక చిన్న తప్పుడడుగు.. రెండు కుటుంబాల జీవితాలను, వారి పరువును ఏ విధంగా రోడ్డున పడేస్తుంది అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

ఫస్ట్ హాఫ్ అంతా పక్కా విలేజ్ అట్మాస్ఫియర్, యూత్‌ఫుల్ కామెడీతో చాలా సరదాగా సాగిపోతుంది. ప్రధాన పాత్రల పరిచయం, రవి-చిట్టి నడుమ ప్రేమ, ఫోన్లలో ఊసులాడుకోవడం వంటి సన్నివేశాలతో నడుస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో కలిసి చేసే హంగామా, అల్లరి సన్నివేశాలు యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. అయితే మొదటి భాగంలో కొన్ని సీన్స్ కాస్త అడల్ట్ కంటెంట్ వైపు వెళ్లినట్లు అనిపించినా.. కథలోని అసలు ఎమోషన్ సెకండ్ హాఫ్‌లోనే దాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ను బాగా డిజైన్ చేసి, సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచారు. 

సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. సినిమా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. పిల్లల ప్రవర్తన బయటపడటం, కుటుంబాల్లో మొదలయ్యే సంఘర్షణ వంటి అంశాలు ఉంటాయి. ఆకర్షణలో పడి తప్పుడు దారిలో వెళ్తే ఎలాంటి భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి, పరువు కోసం తండ్రి పడే వేదన ఏంటి అనేది చాలా ఎమోషనల్ గా చూపించారు. డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేకపోతే టీనేజర్స్ జీవితాలు ఎలా నాశనం అవుతాయో దర్శకుడు బిక్షు యాదవ్ చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి.

'హుషార్ పిట్టలు' ప్రారంభంలో అడల్ట్ కామెడీతో నవ్వించినా, ముగింపులో కంటితడి పెట్టించే ఎమోషన్స్, గొప్ప సామాజిక సందేశాన్ని అందిస్తుంది. చిన్నపిల్లల ముందర పెద్దలు మాట్లాడే మాటలు, చేసే పనులు వారి మనస్సులపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతాయి, స్మార్ట్‌ఫోన్ల మితిమీరిన వాడకం, చెడు స్నేహాలు ఎంతో మంది జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయనే విషయాలను ఇందులో చూపించారు.

నటీనటుల పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అన్ష్ త్రోరాట్, వాసవి గణేషన్ ఇద్దరికీ ఇది మొదటి సినిమాయే అయినా చాలా సహజంగా నటించారు. ఎమోషనల్ అండ్ సీరియస్ సీన్స్‌లో వీరి యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఇక సపోర్టింగ్ రోల్స్ చేసిన నటీనటులు పల్లెటూరి వాతావరణానికి, ఆ యాసకి పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికంగా చూస్తే.. చరణ్ అర్జున్ అందించిన మ్యూజిక్ గ్రామీణ నేపథ్యానికి సరిగ్గా సరిపోయింది. సినిమాటోగ్రఫీ ఊరి వాతావరణాన్ని చాలా నాచురల్ గా ప్రెజెంట్ చేసింది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉండటంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.

ఓవరాల్‌గా చెప్పాలంటే.. 
'హుషార్ పిట్టలు' బోల్డ్ గా ఉండే యూత్‌ఫుల్ సినిమా మాత్రమే కాదు.. టీనేజర్స్ కి, తల్లిదండ్రులకు మంచి మెసేజ్ ఇచ్చే ఎమోషనల్ డ్రామా కూడా.

రేటింగ్: 2.75/5

 

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

 

 

 

Hushar Pittalu Review, Ansh Thorat, Vasavi Ganeshan, Bikshu Yadav

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com